నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్ నటీనటులుగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమాను ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించింది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. తాజాగా బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేసి.. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు.
అయితే.. ఎన్టీఆర్ మాట్లాడేందుకు మైక్ తీసుకోగా నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ వీరాభిమానులు చిరాకు తెప్పించారు. అంతకముందు కల్యాణ్ రామ్ మాట్లాడటం మొదలుపెట్టినప్పట్నుంచే అరుపులు, కేకలు, ఈలలతో హడావుడి చేసిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ వచ్చేసరికి మరింత గట్టిగా అరడం మొదలుపెట్టారు. కల్యాణ్ రామ్ నవ్వుతూ మేనేజ్ చేసి మూడంటే మూడే ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించేశాడు. ఎన్టీఆర్ కూడా అంతే.. అన్నయ్య కంటే ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ తీసుకొని ఉంటాడేమో.! అభిమానుల అరుపులు, కేకలతో చిరాకు పడ్డ జూనియర్..‘బ్రదర్స్ మీరు సైలెంట్‌గా ఉంటే మాట్లాడుతా.. లేకుంటే వెళ్లిపోతాను’ అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఫ్యాన్స్ చేష్టలతో ఎన్టీఆర్ ఎంత ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి.. సుమారు గంటపాటు జరగాల్సిన ఈ కార్యక్రమం అరుపులతో గంట ముందే ముగించేయాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవెంట్ మేనేజింగ్ అట్టర్ ప్లాప్ అని చెప్పుకోవచ్చు. సరిగ్గా బౌన్సర్లు, సెక్యూరిటీ లేకపోవడంతో వీవీఐపీ, ఫ్యాన్స్ అనే తేడా లేకుండా అందరూ స్టేజ్‌కు దగ్గరగా వచ్చేసి హడావుడి చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త గందరగోళంగా మారింది. సో.. ఈవెంట్ ఆర్గనైజింగ్ సరిగ్గా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ‘ఎంత మంచివాడవురా’ ప్రి రిలీజ్‌తో తెలిసింది. ఇక ఫ్యాన్స్ విషయానికొస్తే.. మీరు అభిమానించే.. మీరు మెచ్చే హీరో వచ్చినప్పుడు ఆయన్ను ఎంకరేజ్ చేయాలేగానీ.. ఇలా ఇబ్బందిపెట్టడం ఎంతవరకూ సబబో కాస్త ఆలోచించండి.. అని సినీ విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు.