ఇదేంటి.. టైటిల్ చూడగానే అసలు ఈ వందో రోజు సంగతేంటి..? మర్యాద ఏంటి..? అని కాస్త గజిబిజిగా ఉంది కదూ.. అవును.. మీరు వింటున్నది నిజమే.. సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ కొరటాల శివకు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయడంతో మెగా సూపర్‌స్టార్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. కొరటాలతో తాను నటిస్తున్న సినిమా గురించి ప్రస్తావించారు.
అందరూ ఇలానే చేయాలి!
‘మహేశ్ సినిమా తొందరగానే అయిపోయింది. ఈవెంట్‌కు రావాలని నన్ను పిలిచినప్పుడు నిజంగా నేను షాకయ్యా.. ఇంత త్వరగా సినిమా అయిపోయిందా అని ఆశ్చర్యపోయాను. ఇంత తొందరగా సినిమా తీయడం నిజంగా చాలా మంచి పరిణామం. ప్రతీ డైరెక్టర్ ఇలానే సినిమాలు తెరకెక్కిస్తే ఇండస్ట్రీకి ఇంకేం కావాలి. ఇదే కావాలి.. అందరూ ఇలానే చేయాలి. ఇలా చేస్తేనే పది కాలాల పాటు చల్లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుంది. థియేటర్లు కలకల లాడుతుంటాయ్’ అని చిరు చెప్పుకొచ్చారు.
99 మించిందా.. మర్యాద ఉండదు!
మహేశ్ సినిమా ఇంత తొందరగా అయిపోవడంతో నా డైరెక్టర్ కొరటాలతో మాట్లాడాను. ఏంటి మన పరిస్థితి..? అని అన్నాను. జనరల్‌గా ఆయన కూడా 130-140 రోజుల్లో సినిమా తీసేస్తారు. అయితే మీరు టైమ్ టూ టైమ్‌కు వచ్చే హీరో సార్.. మీతోటి ఈ సినిమా 80-99 రోజుల్లో చేసేస్తాను కానీ 100వ రోజు తీసుకోను సార్ అని అన్నాడు. చూడు శివా.. పబ్లిక్‌లో కమిట్ అవుతున్నా 99 మించిందా.. మర్యాద ఉండదు. ఇదిగో పబ్లిక్ ముందు కమిట్ అవుతున్నా’ అని చిరు అన్నారు. పక్కనే ఉన్న కొరటాల.. చిరుతో చేయి కలిపి కచ్చితంగా సార్ మాటిస్తున్నా అన్నట్లుగా తల ఊపారు. మరి 100వ రోజుకు ముందే ఈ కాంబోలో సినిమా ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.