టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ఫైనల్ టచ్‌లో ఉంది. ఇప్పటికే ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు డేట్‌ను ఫిక్స్ చేశారు. మరోవైపు ఈ సినిమాకు పోటీగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో..’ కూడా 2020 సంక్రాంతికే విడుదల కానుంది. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్రబృందం ఫిక్స్ అయ్యింది.
అయితే అనుకున్నట్లుగా ఈ రెండు సినిమాలు రిలీజ్ కావని తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఈ రిలీజ్ విషయమై రెండు సినిమాల దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారట. మొదట ‘అల వైకుంఠపురములో’ నిర్మాతలు తమ సినిమా విడుదల విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారట. దీంతో ఈ సినిమాను రెండ్రోజుల ముందే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అయితే.. ‘అల..’ సినిమాను చిత్రబృందం అలా డిసైడ్ అవ్వడంతో ‘సరిలేరు..’ టీమ్ కూడా నిర్ణయం మార్చుకున్నారట.
ఫైనల్‌గా రెండు సినిమాలను జనవరి 10వ తేదీనే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ విషయమే హాట్ టాపిక్ అవుతోంది. ఈ వార్త కాస్త మీడియా మిత్రుల చెవిన పడే సరికి పెద్ద ఎత్తున వార్తలు రాసేస్తున్నారు. పలు వెబ్‌సైట్స్‌లో వార్తలు చదివిన అల్లు అర్జున్ మెగాభిమానులు, మహేశ్ వీరాభిమానులు కన్ఫూజన్‌లో పడ్డారట. అసలు ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియట్లేదు.. అసలేంటి..? ఇంత కన్ఫూజన్ అని సోషల్ మీడియా వేదికగా ఒకింత ఆవేదన.. అసంతృప్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే ఇటు ‘సరిలేరు..’ చిత్ర బృందం లేదా.. ‘అల..’ దర్శకనిర్మాతలు స్పందిస్తే కానీ ఈ కన్ఫూజన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాల్లేవ్.