ఏడాది గడిచిపోయే సరికి.. అసలు ఈ సంవత్సరం మనం సాధించిందేంటి..? అని ఒకసారి వెనక్కెళ్లి చూసుకోవడం మామూలే. అందరిలాగే మన నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా 2019లో ఏం ఒరగబెట్టామని ఓసారి డైరీ తిరగేశారట. అయితే.. ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదని.. ఆ ఒక్కటీ తప్ప పెద్దగా సాధించిందేమీ లేదని కనిపించలేదట. ఇంతకీ ఈ ఏడాది బాలయ్య పరిస్థితేంటి..? ఆయన సాధించిన ఆ ఒక్కటీ ఏంటి..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఈ ఏడాదిలో బాలయ్య సినిమాలుగా గట్టిగానే వచ్చాయ్.. అంతేకాదు ఇదే ఏడాదే 2019 సార్వ్రత్రిక ఎన్నికలు కూడా వచ్చాయ్. అయితే సినిమాలేమీ ఆశించినంత ఆడకపోగా.. అట్టర్ ప్లాప్ అవ్వడం బాలయ్య వీరాభిమానులకు, నందమూరి ఫ్యాన్స్‌కు మింగునపడట్లేదు. ఈ ఏడాదే ఆంధ్రుల ఆరాధ్యుడు అన్నగారు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ అంటూ రెండు పార్ట్‌లతో బాలయ్యే నటించి అభిమానుల ముందుకొచ్చారు. అయితే.. ఆ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ సినీ ప్రియులను మెప్పించలేకపోయాయి. అలా ఈ రెండు సినిమాలు ఒకదానికి మించి మరొకటి పరాజయం పాలవ్వడం ఒక చేదు అనుభవమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా ఈ బయోపిక్‌ల ద్వారా ఎన్నికల్లో కూడా ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు, మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. అయితే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే చందంగా ఆశలు నిరాశలే అయ్యాయి. సీన్ మొత్తం రివర్స్ అవ్వగా.. రాష్ట్రం మొత్తమ్మీద కేవలం 23 అంటే స్థానాలకే టీడీపీ పరిమితం అవ్వడం.. అంతేకాదు రాయలసీమలో హిందూపురం నుంచి బాలయ్య, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, కుప్పం నుంచి నారా చంద్రబాబు తప్ప మరెక్కడా టీడీపీ అడ్రస్ కనపడకుండా పోయింది.
అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవడం తీవ్ర బాధను మిగిల్చితే.. హిందూపురంలో బాలయ్య గెలవడం ఒకట్రెండు శాతం సంతోషం కలిగించే విషయం. టీడీపీ స్థాపించిన నాటి నుంచి హిందూపురంలో పార్టీ ఓడిన దాఖలాల్లేవ్.. ఈ ఎన్నికల్లో అది కూడా వైసీపీ ప్రభంజనంలో నిలిచి తట్టుకుని గెలవడం విశేషమేనని చెప్పుకోవాలి. అంటే బాలయ్య సాధించింది ఇదొక్కటే అన్న మాట. అయితే.. ఆ తర్వాత ‘రూలర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఆశించినంతగా రూలింగ్ చేయలేకపోయాడు. మొత్తమ్మీద చూస్తే.. సినిమాల పరంగా అట్టర్ ప్లాప్ అయినా రాజకీయాల పరంగా ఒకింత పర్లేదని అనిపించారని చెప్పుకోవచ్చు.