టాలీవుడ్‌లో మ్యూజిక్ దిగ్గజం ఎం.ఎం. కీరవాణి.. తన తమ్ముడు రాజమౌళి సినిమాలకు సంగీతం ఇస్తూనే బయట సినిమాలు చేస్తుంటాడు. అయితే కీరవాణి కొడుకు కాల భైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్. కాకపోతే ఇప్పటివరకు పెద్దగా హైలెట్ అవ్వలేదు కానీ.. తాజాగా కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా నటించిన ‘మత్తువదలరా’ సినిమాకి నేపథ్య సంగీతంతో అదరగొట్టేసాడు. అంతేనా.. కీరవాణి చిన్న కొడుకు ‘మత్తువదలరా’ సినిమాతో అందరి మత్తు వదిలించేసాడు. పెద్దగా అంచనాలు లేకుండా రాజమౌళి ప్రమోషన్స్‌తో నిన్న విడుదలైన ‘మత్తువదలరా’ సినిమాకి హిట్ టాక్ పడటమే కాదు.. కీరవాణి కొడుకులు కాల భైరవ, శ్రీ సింహాలను టాలీవుడ్ ప్రముఖులు తెగ పొగిడేస్తున్నారు.
కాల భైరవ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఇంతెత్తులో నిలబెట్టగా.. శ్రీ సింహ కామెడీ టైమింగ్, నటన అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. కీరవాణి కొడుకు హీరో అంటే.. ఏ మాస్ సినిమాతోనే, లేదంటే భారీ బడ్జెట్‌తోనో వస్తాడనుకుంటే.. తనకు తగిన పాత్రతో ఎలాంటి అంచనాలు లేకుండా రావడమే కాదు.. రావడం రావడమే తన సత్తా చాటి తానేంటో నిరూపించాడు. కీరవాణి కొడుకు కాదు తెర మీద కనబడింది. ఓ సాధారణ కొరియర్ బాయ్.. పరిస్థితుల ప్రభావంతో.. మర్డర్ కేసు నుంచి ఎలా బయట పడ్డాడో అనేది.. సింహ నేచురల్‌గా మెప్పించాడు. ఇక కాల భైరవ సంగీతంలో కీరవాణి హెల్పింగ్ హ్యాండ్ ఉందనుకునే వారికి.. ఇది కీరవాణి హెల్ప్‌తో తెరకెక్కిన మ్యూజిక్ కాదు.. కాల భైరవ మ్యూజిక్‌లో కొత్తదనం, కీరవాణి మ్యూజిక్ వాసన ఎక్కడా ‘మత్తువదలరా’ లో కనిపించలేదంటూ కాల భైరవ మ్యూజిక్‌ని పొగిడేస్తున్నారు అంతా. ఒకేసారి కొడుకుల సక్సెస్ చూసిన కీరవాణి పొంగిపోతున్నాడంటే నమ్మాల్సిందే మరి.