టాలీవుడ్‌లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అటు అప్పుడప్పుడు సినిమాల్లో చిన్నపాటి పాత్రల్లో.. ఇటు బుల్లితెరపై ప్రదీప్ దర్శనమిస్తున్నాడు. అంతేకాదు.. ఇప్పుడున్న మేల్ యాంకర్స్‌లో అత్యధికంగా పారితోషికం పుచ్చుకుంటున్నది కూడా ఇతనే. అయితే అలా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన ప్రదీప్.. ఇటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే పలువురు కమెడియన్స్, యాంకర్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు హీరోలు కావడంతో తానెందుకు కాలేనని అనుకున్నాడేమో తెలియట్లేదు కానీ.. సినిమాల్లో నటించేస్తున్నాడు. ఈ మధ్యే ప్రదీప్ హీరోగా వస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లిందని తెలుస్తోంది. అయితే.. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని టాక్ నడుస్తోంది. అయితే.. హీరోగా రావాలనుకుంటే ఇలా అడుగడుగానా అడ్డంకులేంటి..? అని ప్రదీప్ అసంతృప్తికి.. నిరాశకు లోనయ్యాడట. అయితే ఇదంతా ఒకప్పటి లెక్క.!
అయితే.. ఈసారి మాత్రం అలాంటి ఆటంకాలేవీ లేకుండా హీరోగా వచ్చేయాల్సిందేనని గట్టిగా అనుకున్న ప్రదీప్.. ఆ దిశగా అడుగులేస్తున్నాడు. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే కుర్రాడు ప్రదీప్‌ను హీరోగా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తుండటం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఓ పెద్ద బ్యానర్‌లో సినిమా నిర్మితం కానుండటం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఆ కుర్ర డైరెక్టర్ ఎవరు..? ఆ పెద్ద బ్యానర్ ఏంటి..? అనే ఆసక్తికర విషయాలు మాత్రం బయటికి రావట్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రదీప్ ఈ సినిమా ప్రాజెక్టుపై మాత్రం ఎక్కడా చిన్నపాటి హింట్ కూడా ఇవ్వలేదు. ఈ సారైన ప్రదీప్ కన్న ‘హీరో’ కలలు నిజమవుతాయో లేదో. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.