టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా.. నా కత్తికి పదునెక్కువ.. అన్నట్లుగా.. నా నోటికి దూలెక్కువా.. నేను విమర్శించడం మొదలెడితే చిన్నా పెద్దా.. అనే తేడా ఉండదు అన్నట్లుగా ఫలానా వారినే అని కాకుండా ఇటు రాజకీయ నేతలు.. అటు సినీ ప్రముఖులు అందర్నీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో, మీడియా డిబెట్స్‌లో హడావుడి చేస్తుంటాడు. అయితే.. ఎన్నికలకు ముందు పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు.. నాటికి నేటికీ కత్తి కాస్త లైన్‌లోకి వచ్చి తనపనేంటో తాను చేసుకుని పోతున్నాడు. అయితే ఊరికే ఉంటే మనకేం ఒరుగుతుంది..? తిన్నది అరగటం కష్టమని భావించాడేమో గానీ.. మరోసారి మెగా ఫ్యామిలీ హీరో నాగబాబును టార్గెట్ చేసుకున్నాడు. ఇటీవల నాగబాబు చేసిన ట్వీట్స్‌పై తనదైన శైలిలో ‘కత్తి’ దూస్తూ.. కౌంటర్ల వర్షం కురిపించాడు!.
నాగబాబు ఏమన్నాడు!?
‘కేవలం హిందువులు ఇతర మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించటం మాత్రమే పరమత సహనం అనిపించుకోదు.. ఇతర మతస్థులు కూడా హిందు మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించినప్పుడే నిజమైన పరమత సహనం అనిపించుకుంటుంది. నిజానికి నేనొక నాస్తికుడిని. కానీ నేను హిందు మతాన్ని విపరీతంగా గౌరవిస్తాను. కారణం హిందు మతంలో నాస్తికుల అభిప్రాయాలకి కూడా చాలా గౌరవం ఉంది. అందుకే చార్వాకం. నిరీశ్వరవాదం కూడా ప్రసిద్ధి చెందాయి. వేరే మతాలలో అయితే నాస్తిక (Atheism)ఫాలో అయ్యేవాళ్ళకి చావే తలరాత అయ్యుండేది’ అని ట్విట్టర్‌లో నాగబాబు రాసుకొచ్చాడు.
కత్తి ఏమన్నాడు..!?
‘నాగబాబుకు పిచ్చి ముదిరింది. పిచ్చి ముదిరింది... వీడి తలకి రోకలి చుట్టండ్రా!. మెల్లగా హిందూ కార్డ్ వాడకం మొదలు పెడుతున్నారు అంటే.. బీజేపీ చేరువకి టీజర్ అనుకోవచ్చా?. మీకు ఇంకా సందేహమా..? వీళ్లవి అన్నీ అబద్దాలు మోసాలే’ అంటూ కత్తి మహేశ్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు విసిరాడు. అంతటితో ఆగని ఆయన.. కులం, మతం చర్చ లేనిదే మన నాయకులు రాజకీయాలను చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ఏపీ రాజకీయాలు మరీ దారుణంగా ఉన్నాయని.. రెడ్డి అని ఒకరు అంటే.. నాయుడు అని ఇంకొకరు. హిందువు అని ఒకరు అంటే క్రిస్టియన్ అని ఇంకొకరు ఇలా చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. తనపై విమర్శలు గుప్పిస్తే చాలు సోషల్ మీడియా వేదిక రియాక్ట్ అయ్యే మెగా బ్రదర్.. కత్తి తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.