రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇక సినిమాల జోలికి వెళ్లనని ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనని స్వయంగా ప్రకటించాడు.. అంతేకాదు మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పాడు. అయితే ఆయన మళ్లీ కచ్చితంగా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడని.. అది కూడా ‘పింక్’ మూవీతోనే అని గట్టిగా టాక్ నడిచింది. ఒకానొక సందర్భంలో పింక్ రీమేక్ చేస్తున్నది కరెక్టేనని సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు.! దాదాపుగా పవన్‌నే ఫిక్స్ అయిపోయినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చీత్కారాలు పడటంతో పవన్ పేరు మరుగున పడింది. ఇదంతా ఒకప్పటి సంగతి.
అధికారిక ప్రకటన వచ్చింది కానీ..!
తాజాగా.. ‘పింక్’ రీమేక్ మూవీని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. కాగా.. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నాడు. ఇంతవరకూ అధికారికంగా ప్రకటించిన అనంతరం చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నట్లు కూడా ఓ ప్రకటనలో తెలిపాడు దిల్‌రాజు. అంతేకాదు.. ఇప్పటికే ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభమైంది. గురువారం నాడు ఇందుకు సంబంధించి చిన్న లిటిల్ బిట్ ట్యూన్ కూడా డైరెక్టర్, నిర్మాతకు థమన్ వినిపించాడట.
కన్ఫూజన్.. కన్ఫూజన్!
అయితే డైరెక్టర్.. ప్రొడ్యూసర్ సరే.. సంగీత దర్శకుడు కూడా ఓకే.. మరి హీరో, హీరోయిన్ సంగతేంటి..? అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. పవన్ ఫిక్సయ్యాడని టాక్ నడుస్తోంది. మరోవైపు పవన్-దిల్ రాజు కాంబోలో పింక్ రీమేక్ పక్కా అనేది వాస్తవమే కానీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది మాత్రం సందేహమేనని జనసేనకు సంబంధించిన అత్యంత సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం బిజీబిజీగా పవన్ డిసెంబర్ చివరి వారంలో షూటింగ్‌లో పాల్గొంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. మరోవైపు హీరోయిన్‌గా పవన్ సరసన నివేధా థామస్ అయితే బాగుంటుందని భావించినప్పటికీ.. టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్దేను తీసుకోవాలనుకున్నారట. అంతేకాదు.. తాప్సి పాత్రకి అక్కినేని కోడలు సమంత అయితే కరెక్ట్ అని భావించారట. సామ్ అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని దిల్‌రాజు దాదాపు ఫిక్స్ అయ్యారట.
డేట్స్ ఫిక్సయ్యాయ్..!
ఆసక్తికర విషయమేమిటంటే.. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ‘పింక్’ రీమేక్ ప్రారంభమైనట్లు తెలిసింది. ఎలాంటి మీడియా హడావుడి లేకుండా దిల్‌రాజు ఆఫీస్‌లోనే ఈ తంతు జరిగిపోయిందని సమాచారం. పవన్ కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’లో పాల్గొంటున్న నేపథ్యంలో బిజిబిజీగా ఉండటంతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించేశారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ మూడోవారం లేదా జనవరి రెండో తారీఖు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందట. అంతేకాదు.. ఫిబ్రవరి నుంచి పవన్ సెట్స్‌లోకి అడుగుపెడతానని డేట్స్ ఇచ్చేశారట. కేవలం 20 రోజులు మాత్రమే పవన్ డేట్స్ ఇచ్చేశారట.
దిశ ఘటన ఎఫెక్ట్..!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా దిశ సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుండటం అంతా హడావుడిగా ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం ఏ నోట చూసిన ఈ ఘటననే నానుతోంది. అందుకే ఈ టైమ్‌లో తీయడం వల్ల జనం ఎక్కువగా ఆకర్షితులవుతారని దిల్ రాజు భావించి.. ఇది ఒక సోషల్ మెసేజ్ కూడా అవుతుందని పవన్‌కు చెప్పగా ఇన్నిరోజులుగా ఒప్పుకోని ఆయన.. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్.
పింక్ కథకు ‘దిశ’కు సంబంధం ఇదీ..!?
సమాజంలో మనుషులు ఒక అమ్మాయిని ఏ రకంగా చూస్తున్నారు? అదే అబ్బాయిని ఏ రకంగా చూస్తున్నారు..? అనేది చాలా చక్కగా చూపించారు. ఒక అబ్బాయి మద్యం సేవించినా, సిగరెట్ అలవాటు ఉన్నా, అర్ధరాత్రి వరకు తిరిగినా ఈ సమాజం పట్టించుకోదు కానీ.. అదే పనులు ఒక అమ్మాయి చేస్తే ఆమెను ఎందుకు చెడుగా చూస్తారు..? అర్ధరాత్రి వరకు తిరిగితే అమె వ్యక్తిత్వం బాగా లేదు అని ఎందుకు అంటారు? అనే కోణాన్ని చూపించారు. ముగ్గురు మద్య తరగతికి చెందిన యువతులు (తాప్సీ, ఫలక్, ఆండ్రియా) సిటీకి వచ్చి ఓ రూంలో అద్దెకు ఉండగా వీరిపై రేప్ అటెంప్ట్ జరుగుతుంది. ఆ ఛేదు ఘటన వీరు మరిచి పోదామనుకున్నా.. ఆ అత్యాచారం చేసిన వాడు సంఘంలో బలమైన వాడు ఉంటే న్యాయం ఏ వైపుకు వెళ్తుంది. న్యాయం కోసం ఎలా పోరాడారు..? ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యయి..? అనేదే సినిమా. అయితే దిశ ఘటన అనంతరం బాధిత కుటుంబీకులు న్యాయం పోరాడటం.. వారికి ప్రజలు తోడవ్వడంతో ఆ వ్యవహారం చివరికి ఎన్‌కౌంటర్ దాకా వెళ్లింది. రెండు ఘటనల్లో న్యాయం కోసం పోరాటం కామన్.
ప్రకటన ఎప్పుడో..!
ఇది సోషల్ మెసేజ్ కావడంతో.. సమాజంలో మార్పు, మొలుకువల కోసం చేస్తున్నానని చెప్పేందుకు ఓ ఆప్షన్ ఉంటుందని పవన్ రీమేక్‌కు ఒప్పుకున్నారని టాక్. మరోవైపు జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు కూడా సినిమాల్లోకి రావాలని కోరుతుండటంతో కాదనలేక ‘పింక్’ అంటూ ఇండస్ట్రీలోకి మళ్లీ దూకుతున్నారట. దిల్‌రాజు చెప్పడం వరకూ ఓకే గానీ.. పవన్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో..? అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.