టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. ఒకప్పుడు ఆయన సినిమాలంటే జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఈయన సినిమాలు ఆదరిస్తుండేవారు. అయితే అదే మూసదోరణిలో సినిమాలు తీస్తుండటంతో బోయపాటిని పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఇందుకు చక్కటి ఉదాహరణ ‘వినయ విధేయ రామ’. ఈ సినిమాకు ఏ రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చారో.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత జనాలు ఏ మాత్రం ఆదరించారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.
వాస్తవానికి భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించడానికే బోయపాటి ఆసక్తి చూపుతూ ఉండటమే కాకుండా తాను కూడా గట్టిగా పుచ్చుకోవాలని అనుకుంటాడు. ఇప్పటి వరకూ రూ. 15 కోట్లు పారితోషికం తీసుకునే బోయపాటి అనూహ్యంగా మనసు మార్చుకున్నాడని.. సగం మాత్రమే అనగా 8 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడని మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే అదంతా అబద్ధమేనట. అస్సలు తగ్గేది లేదని.. 15 కోట్లే తీసుకుంటానని చెప్పేశాడట. ఈ ఆసక్తికర విషయం నందమూరి నటసింహం బాలయ్య సినిమాతో వెలుగు చూసింది.
బాలకృష్ణ ‘రూలర్’ రిలీజ్ అనంతరం.. ఆయనతో బోయపాటి శ్రీను కొత్త సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేశారు కూడా. ఈ సినిమా బడ్జెట్ రూ. 70 కోట్లు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య, బోయపాటి పారితోషికాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్య 10 కోట్లు, బోయపాటి 15 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో బోయపాటి తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ అట్టర్ ప్లాప్ తర్వాత కూడా ఈ రేంజ్‌లో ఆయన డిమాండ్ చేయడంతో.. అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీకి చెందిన కొందరు నోరెళ్లబెడుతున్నారట. మరి ఈ పుకారులో ఏ మాత్రం నిజముందో తెలియాల్సి ఉంది.