రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రాంగోపాల్ వర్మతో కలిసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు రివైజింగ్ కమిటీలో పూర్తి చేసుకుందని.. యు/ఎ సర్టిఫికెట్ లభించిందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు. అంతేకాదు.. ఈ నెల 12న అనగా గురువారం ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఎల్లుండి సినిమా రిలీజ్ చేస్తున్న టైమ్‌లో ఆర్జీవీకి హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది. మంగళవారం నాడు ఈ సినిమాపై ఓ ప్రముఖుడు వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అయితే కోర్టుకు ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు వివరణ ఇచ్చుకుంది. ‘ ఇప్పటి వరకూ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పింది. ఇందుకు స్పందించిన కోర్టు.. సెన్సార్ క్లియరెన్స్ లేని సినిమాకు విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారు? అని సినిమా యూనిట్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది.
మరోవైపు.. సినిమాలోని 12 అభ్యంతరకర దృశ్యాలు తొలగిస్తామని ఫైనల్‌గా ఆర్జీవీ కోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించిన సన్నివేశాల తొలగింపుపై ఫైనల్‌గా నిర్ణయం తీసుకుని పూర్తి ఆధారాలతో సహా రావాలని సెన్సార్, ఆర్జీవీని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను బుధవారంకు హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే.. భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్‌కు, సాంగ్స్‌కు, విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం చేయలేదని.. ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథాల్లో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని ఇదివరకే చిత్రబృందం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.