నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా ప్రెస్టీజియస్ మూవీ ప్రారంభం!!
‘సింహా’. ‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3 గా మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ లోనే ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో చెప్పారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - “ఈరోజు శుభదినం. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న నా మరియు బోయపాటి శ్రీను కలయికలో ద్వారక క్రియేషన్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా నూతన చిత్రం ప్రారంభం జరిగింది. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు చేయడం, అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అయితే నాది, బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్‌ట్రేషన్ మా నెక్స్ట్ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం.రత్నంగారి కథ, సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదైతే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత బాధ్యత తీసుకుంటాం కనుకనే ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మికం కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. ఇండస్ట్రీకి మిర్యాల రవీందర్‌లాంటి మంచి మంచి యంగ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్‌లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు శిక్ష విధించాడు
దిశ అనే మహిళపైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నాన్నగారు అన్న నందమూరి తారక రామారావుగారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అలాగే ‘లెజెండ్’ సినిమాలో మేము కూడా స్త్రీ లేకుంటే సృష్టి లేదు అనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మన మహిళలపై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది. మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. అందరికీ ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ... “ద్వారక క్రియేషన్స్‌లో నా రెండవ సినిమా ఇది. బాలయ్యబాబు, నాది హ్యాట్రిక్ ఫిలిం. ఇండస్ట్రీలో నా మొదటి సినిమా ‘భద్ర’. ఒక మంచి సినిమాతో నా లైఫ్ స్టార్ట్ అయింది. ‘సింహా వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ఆ రెండు సినిమాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను.’’
పొల్యూషన్ నుంచైనా తప్పించుకోవచ్చు కానీ పోలీస్ నుంచి తప్పించుకోలేరు
దిశకి జరిగిన అన్యాయం గురించి దేశంలోని అందరూ బాధపడుతున్నప్పుడు తెలిసిన మంచి విషయం ఏంటంటే వారు పారి పోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేయడం. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి ‘‘పొల్యూషన్ నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ పోలీస్ నుండి ఎవరూ తప్పించుకోలేరు” అన్నారు.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... “భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీస్తుండొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆ గౌరవాన్ని సినిమా విడుదల తర్వాత బాలకృష్ణగారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్ చేస్తున్నాను” అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: థమన్ ఎస్.ఎస్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.