శంషాబాద్‌లో వైద్యురాలిపై జరిగిన హత్యోదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బహుశా దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత అంతటి ఘోర ఘటన శంషాబాద్‌దే అని చెప్పవచ్చు. అందుకే మీడియా కూడా ఈ ఘటనకు ‘తెలంగాణ నిర్భయ’ అని పేరు పెట్టింది. మరోవైపు.. పోలీసులు సైతం ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి పేరుకు బదులుగా ‘దిశ’.. నిరసనలు తెలిపేటప్పుడు ‘జస్టిస్ ఫర్ దిశా..’ అని సంబోంధించాలని సూచించారు. ఇప్పటికే టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకూ సెలబ్రిటీలు స్పందించి తమదైన సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా.. ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు.
పోసాని స్పందన సరే గానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలే కాస్త హాట్ టాపిక్‌గా మారాయి. అత్యాచారానికి పాల్పడిన ఆ నలుగురు కుర్రాళ్లు పెద్ద క్రిమినల్స్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకిలా.? అనేదానికి పెద్ద కారణమే ఆయన చెప్పుకొచ్చారు. ‘మనం ఓట్లేసి ఎన్నుకుంటున్న కొందరు నేతలు.. మనకు మనగా నియమించుకుంటున్న కొందరు పోలీసులు, మనం కొలిచే కొందరు బాబాలతో పోలిస్తే ఈ నలుగురు కుర్రాళ్లేం పెద్ద నేరస్తులు కాదు. వాళ్లను చంపినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయా?. అత్యాచారం చేశారు కాబట్టి చంపేయాలంటున్నారు.. ఆ నలుగుర్నీ చంపినా ఇలాంటి వాళ్లు బయట కోట్ల మంది ఉన్నారు. వాళ్లను ఏం చేస్తారు..? వాళ్ల సంగతేంటి..?. ఆ నలుగురు నిందితులన్నీ చంపినంత మాత్రాన 130 కోట్ల మందిలో మార్పు రాదు’ అని ఈ సందర్భంగా పోసాని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు.. అరబ్ కంట్రీస్‌లో వేసే శిక్షలు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావనకు తెచ్చారు. అయితే పోసాని వారికి మద్దతుగా మాట్లాడుతున్నారా..? లేకుంటే ఉరితీయడాన్ని తప్పుబడుతున్నారా..? ఆయనకే ఎరుక. మొత్తానికి చూస్తే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.