సంచలనాలకు కేరాఫ్ దర్శకుడు.. వివాదాలే ఊపిరి అంటున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఈ చిత్రం ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది. వివాదాస్పద సినిమా కావడంతో పలువురు ఈ సినిమా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖైలంది. దీనిపై సుధీర్ఘంగా విచారించిన కోర్టు రిలీజ్ చేయడానికి వీల్లేదని.. ఇందులో రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యవహారాలున్నాయని తేల్చిచెప్పేసింది. దీంతో రిలీజ్‌కు కాకుండా ఆర్జీవీకి కోర్టు షాకిచ్చింది. మరోవైపు టైటిల్ మార్చాల్సిందేని.. వైఎస్ జగన్ సర్కార్ సైతం పట్టుబట్టింది. దీంతో అటు ముందుకెళ్లలేక.. ఇటు వెనక్కీ వెళ్లలేక ఆర్జీవీ తర్జనభర్జన పడుతున్నాడు.
అయితే ఇప్పటికే సినిమాలో ఎవరెవరి పాత్రలుంటాయ్..? ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారు..? ఏ పాత్ర ఎవరిది..? అనే విషయాలు ఇప్పటి వరకూ వచ్చిన లుక్స్, ట్రైలర్‌లు చూస్తే.. రాజకీయాల గురించి కాసింత తెలిసుకున్న చిన్నపిల్లాడికి సైతం తెలిసిపోతుంది. అయితే ఇంతవరకూ రివీల్ చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా..? అవన్నీ ఆర్జీవీ సీక్రెట్‌గా పెట్టాడా..? అనే ప్రశ్నలు మాత్రం ఆయన అభిమానుల్లో రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. అయితే అభిమానులు ఏవైతే ప్రశ్నలు అనుకుంటున్నారో అవన్నీ ఓ టీవీ చానెల్ డిబెట్ వేదికగా ఆర్జీవీకి ఎదురయ్యాయి.
ఇప్పటికే సినిమాలో నందమూరి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలు ఉంటాయా? అనే ప్రశ్నకు అస్సలు ఉండవు గాక ఉండవ్ అని తేల్చిచెప్పేశారు. అయితే అప్పట్లో ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవి పాత్ర కచ్చితంగా ఉండొచ్చేమో అని మెగాభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయ్. ఇందుకు స్పందించిన ఆర్జీవీ.. అస్సలు చిరు ప్రస్తావన తీసుకురాలేదు.. ఆ అవకాశమే రాలేదన్నాడు. అయితే పవన్ మాత్రం ఎందుకు ఎంచుకున్నారని డిబెట్‌లో ప్రశ్నించగా... ‘పవన్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆయన వేదికలపై మాట్లాడే తీరు బావుంటుంది. ఎంతో బాగా మాట్లాడే పవన్ అప్పుడప్పుడు దారి తప్పుతుంటాడు. ఇక చిరంజీవి ఎంతో సాఫ్ట్. అందుకే ఆయనను తెరపై చూపించలేం’ అని ఆర్జీవీ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.