షకలక శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘2 ప్లస్ 1’ చిత్రం కోసం మాస్ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ రెండు పాటలు రాస్తున్నారు. కాచిడి గోపాల్ రెడ్డి దర్వకత్వంలో సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకటరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో పక్కా మాస్ బీట్‌తో సాగే రెండు పాటలను భాస్కరభట్ల రవికుమార్ రాస్తున్నారు. సంగీత దర్శకుడు హరిగౌర, దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి, నిర్మాత సురేష్ కొండేటి, భాస్కర భట్ల కూర్చుని చర్చించి మరో రెండు పాటలకు సంబంధించిన ట్యూన్లను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ప్రస్తుతం మళ్లీ పాటల ట్రెండ్ వచ్చిందన్నారు. ఒకప్పుడు సినిమా బాగుండకపోయినా పాటల కోసమైనా సినిమాలను మళ్లీమళ్లీ చూసేవారు. అలా చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. మధ్యలో కొంతకాలం పాటలను అదనపు భారంగా భావించారో ఏమోగాని పాటలు లేకుండానే సినిమాలు వచ్చాయి. సినిమాలో పాటల సంఖ్య 6 నుంచి నాలుగుకు పడిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని లిరికల్ వీడియోల ట్రెండ్ వచ్చింది. ఆమధ్య వచ్చిన
‘గీతా గోవిందం’ దగ్గర నుంచి ఈ లిరికల్ వీడియోల ట్రెండ్ బాగా ఎక్కువైంది. ట్రైలర్లకన్నా ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఇటీవల ‘అల వైకుంఠపురము’లో పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అందుకే మేము కూడా పాటల మీద ప్రత్యేక శ్రధ్ద పెట్టాము. ఒకప్పుడు ఆడియో విడుదల ట్రెండ్ ఉండేది. ఇప్పుడు అది పోయి సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే పాటలు జనంలోకి వెళ్లిపోతున్నాయి. ఇది శుభపరిణామం. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు పాటలే సినిమాని బతికిస్తున్నాయి అని నా అభిప్రాయం అని వివరించారు. ‘పాటలకు మాస్ మసాలా ఎలా జోడించాలో భాస్కరభట్ల రవికుమార్‌కు బాగా తెలుసు. పైగా నాతో ఉన్న స్నేహం కారణంగా నా పాటల విషయంలో తను ప్రత్యేక శ్రద్ధతీసుకుని ఈ పాటలు రాస్తున్నారు’ అని చెప్పారు. ఈ సినిమాలో ఉండేది నాలుగు పాటలే అయినా నలభై ఏళ్ల పాటు గుర్తుండేలా ఈ పాటలను రూపొందిస్తున్నామన్నారు.
మరో నిర్మాత వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తయిందని అన్నారు. ఇది సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుందన్నారు. మిగిలిన టాకీ పార్టుతో పాటుగా పాటల చిత్రీకరణ షూటింగ్ కూడా డిసెంబరులో పూర్తవుతుందని వివరించారు. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని చెప్పారు. హీరోగా షకలక శంకర్ కు ఇది బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడుతూ తాను ఇంతకుముందు కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలకు సంగీతం అందించినట్లు చెప్పారు. సంగీత దర్శకుడిగా తనకిది మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు.
దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మల్టీ జోనర్ సినిమాగా ఇది తెరకెక్కుతుందని చెప్పారు. ఒక పాటను సురేష్ ఉపాధ్యాయ రాశారని, రెండు మాస్ పాటలను భాస్కరభట్ల రవికుమార్‌తో రాయిస్తున్నట్లు చెప్పారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఈ సినిమాలో ఉంటాయని వివరించారు.