టైటిల్ చూడగానే ఇదేంటి లక్ష్మీ పార్వతి ఎవరబ్బా..? కొంపదీసి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి అయితే కాదు కదా..? అని కాసింత సందేహం కలిగింది.. కదూ అవును మీ సందేహమే నిజం.. ఆ లక్ష్మీ పార్వతే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా ఓ కీలక పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే రస్టిక్ డ్రామాలో ఓ చిత్రం రాబోతోంది. దానికి ‘రాధాకృష్ణ’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమాలో నటించే హీరోయిన్ ముస్కాన్ స్వయానా చెప్పింది. కాగా ఈ చిత్రం ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ కావడంతో లక్ష్మీ పార్వతి నటిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. లక్ష్మీ పార్వతితో కలిసి నటించడం తనకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని ముస్కాన్ చెప్పుకొచ్చింది.
కాగా ‘రాధాకృష్ణ’ చిత్రంలో నటించాలని చిత్రబృందం లక్ష్మీపార్వతిని సంప్రదించగా రెండ్రోజుల పాటు టైమ్ తీసుకున్న ఆమె చివరికి కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మీ పార్వతి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. దివంగత ముఖ్య మంత్రి ఎన్టీఆర్.. ఆంధ్రుల ఆరాధ్యుడు అన్నగారి రెండో సతీమణి. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈమె.. అన్నగారి మరణాంతరం అడ్రస్ లేకుండా పోయారు!. ఆ తర్వాత మళ్లీ వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె కండువా కప్పుకున్నారు. నాటి నుంచి మళ్లీ ఈమె తనకు పూర్వ వైభవం తెచ్చుకుంది. అలా ఇప్పటి వరకూ వైసీపీలో ఒకింత ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు. మరీ ముఖ్యంగా అటు నారా.. ఇటు నందమూరి కుటుంబీకులపై రాజకీయంగా మాట్లాడి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. అలా.. ఆమె వాక్‌చాతుర్యాన్ని .. ఇష్టా ఇష్టాలను తెలుసున్న జగన్.. కొద్దిరోజుల క్రితమే తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.
అయితే.. రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చాక లక్ష్మీపార్వతికి మంచి రోజులొచ్చాయ్. మరి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈమెకు ఇండస్ట్రీలో ఏ మాత్రం నిలుస్తుందో..? అసలు ఈమె పాత్ర ఎలా ఉండబోతోందో..? అనేది తెలియాలంటే ‘రాధాకృష్ణ’ థియేటర్లలోకి వచ్చినంతవరకూ వేచి చూడాల్సిందే మరి.