Advertisement
Google Ads BL

‘సిరా’ కోసం యండమూరి, కృష్ణవంశీ, రాజశేఖర్


విద్యావ్యవస్థలో లోపాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ... ‘రిషి’, ‘ఆంధ్రాపోరి’ చిత్రాల దర్శకుడు రాజ్‌ మాదిరాజు రాసిన నవల ‘సిరా’. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్కకావిష్కరణ జరిగింది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌కు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ అందజేశారు. రాజ్‌ మాదిరాజు తల్లితండ్రులకు యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో

Advertisement
CJ Advs

కృష్ణవంశీ మాట్లాడుతూ... ‘‘నేను ఇంకా ఈ పుస్తకాన్ని చదవలేదు. సో... దాని గురించి ఏం మాట్లాడలేను. కానీ, రాజ్‌ మాదిరాజు ఈ పాయింట్‌ చెప్పాడు. విద్యావ్యవస్థ మీద పుస్తకం రాశానని చెప్పాడు. నాకు నచ్చింది. చేతన్‌ భగత్‌ ‘త్రీ మిస్టేక్స్‌’ తర్వాత విద్యావ్యవస్థ మీద వచ్చిన పుస్తకం ఇదే అనుకుంటున్నా. రాజ్‌ నాకు ఏడాదిన్నరగా తెలుసు. అతడితో స్నేహం ఏర్పడింది. అతడిలో చాలా నాలెజ్డ్‌ ఉంది. ఒక్కోసారి మాట్లాడుతుంటే భయం వేస్తుంది. రాజ్‌ మాదిరాజు ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా. ఆడియో విజువల్‌ మీడియా వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయింది. వ్యక్తిగతంగా, నేనయితే యండమూరిగారి పుస్తకాల తర్వాత వేరేవి చదవాలనిపించడం లేదు. నాకున్న మిరపకాయ లాంటి జ్ఞానం యండమూరి పుస్తకాల వల్లే వచ్చింది. రాజ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ... ‘‘విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే... కారణం మనమే. మన వ్యవస్థ, ప్రభుత్వాలు. మనిషి జీవితంలో చదువుకునే సమయం ఒత్తిడితో కూడుకున్నది. ‘హిందీ మీడియం’ సినిమా చూశా. పిల్లల్ని మంచి స్కూల్‌లో జాయిన్‌ చేయడానికి తల్లితండ్రులు ఎంత తపన పడుతున్నారనేది బాగా చూపించారు. స్కూల్‌లో జాయిన్‌ చేయించిన తర్వాత ఎగ్జామ్స్‌ టైమ్‌లో సగం లైఫ్‌ పోతుంది. ఒత్తిడి వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ బుక్‌ ఒక విజిల్‌ బ్లోయర్‌ కావాలనీ, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను ప్రభుత్వాలు తీసుకురావాలనీ, ప్రయివేట్‌ సంస్థలు కాకుండా, ప్రభుత్వమే విద్యా వ్యవస్థను నడపాలనీ బావుంటుందని అనుకుంటున్నా. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేయాలని ఏపీ సీయం జగన్‌గారు తీసుకొచ్చిన విధానం నాకు నచ్చింది. మన భాష అంతరించకుండా, తెలుగును కంపల్సరీగా పెట్టుకుని ఇంగ్లీష్‌లో టీచింగ్‌ చేస్తే మంచిది. అప్పుడే ఈ కాంపిటీటివ్‌ ప్రపంచంలో బతకగలుగుతాం. ఈ పుస్తకంలోని కథలో మనసుని హత్తుకునే అంశాలు ఉంటే తప్పకుండా ఈ సినిమాను నేనే చేస్తా. ఈ బుక్‌ పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ... ‘‘నేను రాజ్‌ మాదిరాజును చూడటం ఇదే తొలిసారి. కుర్రాడు బావున్నాడు. చిన్నప్పుడు నేనూ అలాగే ఉండేవాణ్ణి. ఆయన సినిమా ఫీల్డ్‌ నుండి రచయితగా వచ్చాడు. నేను రచయిత నుండి సినిమా ఫీల్డ్‌కి వెళ్లాను. ఆయన తొలి సినిమా సరిగా ఆడలేదు. దర్శకుడిగా నా తొలి సినిమా సూపర్‌ డూపర్‌ ఫ్లాప్‌. ఆయన తర్వాత సినిమాలు బాగా ఆడాయి. అవార్డులు వచ్చాయి. మనిషి అంచలు అంచలుగా ఎదగడం మంచిదే. ప్రతి ఒక్కరిలో లెఫ్ట్‌ బ్రెయిన్‌, రైట్‌ బ్రెయిన్‌ అని రెండు ఉంటాయి. రైట్‌ బ్రెయిన్‌ బావున్నవాళ్లు మ్యాథమెటిక్స్‌, మేనేజ్‌మెంట్‌ రకరకాల లెక్కలకు సంబంధించిన విషయాల్లో చురుగ్గా ఉంటారు. లెఫ్ట్‌ బ్రెయిన్‌ ఉన్నవాళ్లు మెడిసిన్‌, ఫిలాసఫీ, లిటరేచర్‌, లా... వీటిలో బావుంటారు. తల్లితండ్రులకు తెలియక, సరిగా గుర్తించలేక ఇటు నుండి అటు, అటు నుండి ఇటు చేస్తారు. నేను రైట్‌ బ్రెయిన్‌ పర్సన్‌. మా ఇంట్లో డాక్టర్‌ ఎవరూ లేరని నన్ను బైపీసీ జాయిన్‌ చేశారు. అందుకని, బీకాంలోకి వచ్చాను. పాఠకులను చదివించేలా రాయడం లేకపోవడం వల్ల నవలా సాహిత్యం తగ్గింది. మూడు రకాల నవలలు ఉంటాయి. మొదటి రకం నవల్లో సామాజిక సమస్య ఏమీ ఉండదు. రెండో రకంలో సామాజిక సమస్యను తీసుకుని, పరిష్కారం చూపరు. మూడో రకంలో సమస్యను తీసుకుని పరిష్కారం చూపిస్తారు. రాజ్‌ మాదిరాజు రెండో రకంలో రాశాడో? మూడో రకంలో రాశాడో? నాకు తెలియదు. పాపులర్‌ నవలలు తగ్గుతున్న ఈ టైమ్‌లో, నేను దాదాపు రిటైర్‌ అయ్యాను కాబట్టి రాజ్‌ మాదిరాజుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా’’ అన్నారు.

నటుడు, న్యాయవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి సీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ... ‘‘ఈ వేదికపై నేను ఉండటానికి నాకున్న అర్హత ఏంటంటే... రాజ్‌ మాదిరాజు నా స్నేహితుడు కావడం, ఆయన ‘రిషి’ సినిమాలో నేను న్యాయవాదిగా నటించడం! ఈ నవలలో 15, 20 పేజీలు చదివే సరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకో 15 పేజీలు చదివే సరికి కొంచెం బోర్‌ కొట్టింది. 40, 50 పేజీలు చదివే సరికి ‘నవల ఇస్తానని నాకొక థీసిస్‌ పేపర్‌ ఇచ్చాడేమిటి?’ అని సందేహం కలిగింది. అంతగా లీగల్‌ కోణంలో రాశాడు. వేదాల నుండి న్యాయం ఎలా పుట్టిందనేది నాకు జ్ఞానోదయం చేసిన లీగల్‌ నవల ఇది. చాలా అద్భుతంగా ఉంది’’ అని అన్నారు.

సీనియర్‌ పాత్రికేయులు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ... ‘‘నాగరిక ప్రపంచంలో, సామాన్య కుటుంబాల్లో, విద్యార్థులకు చదువు ఒక తపస్సు. తొలి ఉషస్సు. ఆ చదువుని, చదువు మీద తల్లితండ్రులకున్న ఆకాంక్షలు, ఆశలను ప్రయివేట్‌ కళాశాలలు ఎంత చెత్తగా తయారు చేస్తున్నాయి? పిల్లల ప్రాణాలతో ఎంతలా చెలగాటం ఆడుతున్నాయి? అనేది ఈ నవలలో ఇతివృత్తం. ‘సిరా’లో సిద్ధార్థ్‌ అనే యువకుడు చివరగా మరణిస్తాడు. మేడ మీద నుండి దూకేస్తాడు. నేను నవల చదివిన రెండు రోజులకు ఐఐటీలో సిద్ధార్థ్‌ అనే యువకుడు మేడ మీద నుండి దూకి మరణించాడు. వార్త చదువుతున్నానా? నవల చదువుతున్నానా? అనేది అర్థం కాలేదు. మొత్తానికి, సమాజానికి పనికొచ్చే నవల, నిద్రపుచ్చేది కాకుండా... నిద్ర తెరిపించే నవలను మిత్రులు, దర్శకులు రాజ్‌ మాదిరాజు నుంచి రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమాగా రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

రచయిత లక్ష్మీభూపాల్‌ మాట్లాడుతూ... ‘‘ఎన్నో నవలలు రాసిన అనుభవమున్న రచయితగా రాజ్‌ మాదిరాజు ఈ నవల రాశారు. ఎందరిలో తన నవలలతో స్ఫూర్తి నింపిన యండమూరిగారితో ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ‘సిరా’ చదివిన తర్వాత నేరుగా నేను కోర్టుకు వెళ్లి వాదించ వచ్చినంత ధీమా కలిగింది. అంత బాగా కేసులు, కేసుల్లో విషయాలు, సమస్యల గురించి రాశారు. అద్భుతమైన విషయాన్ని, కఠినమైన వాస్తవాలను, తలచుకుంటే వెక్కి వెక్కి ఏడ్వాలనిపించే విషయాలను చాలా ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా రాజ్‌ మాదిరాజుగారు రాశారు. త్వరలో ఇది సినిమాగా రాబోతుందని తెలిసింది’’ అని అన్నారు.

రాజ్‌ మాదిరాజు తండ్రి విజయానంద్ మాట్లాడుతూ... ‘‘వృత్తిరిత్యా నేను ఇంజినీర్‌. కానీ, సాహిత్యం అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలని ఆశిస్తున్నా. తన నవలలో నన్ను, నా శ్రీమతిని ప్రస్తావించడం సంతోషం’’ అన్నారు.

రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... ‘‘కొన్ని రోజులుగా రాజ్‌ మాదిరాజు మాతో పని చేస్తున్నారు. అతను రాసిన ‘సిరా’ పుస్తకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే... అది సినిమాగా రాబోతుందని విన్నాను. రాజ్‌ మాదిరాజుకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ... ‘‘రాస్తే యండమూరిలా రాయాలి, తీస్తే కృష్ణవంశీలా తీయాలి. చేస్తే రాజశేఖర్‌లా చేయాలనే తరంలో పెరిగాను. వాళ్లు ముగ్గురూ ఇక్కడ ఉన్నారు. నేనిది పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నా. చాలా డెప్త్‌ ఉన్న కథ ఇది. లీగల్‌ సిస్టమ్‌, ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌, టీనేజర్స్‌ మైండ్‌సెట్‌... ఇందులో మూడు ఉన్నాయి. ఒక వెబ్‌ సిరీస్‌ చూసి, వందలాదిమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తండ్రి తిట్టాడని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి ఘటనలు ఉన్నాయి. ‘సిరా’లో హీరోలు ఇద్దరు. మల్టీస్టారర్‌. అందులో ప్రొఫెసర్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. దాన్ని రాజశేఖర్‌గారిని మైండ్‌లో పెట్టుకుని రాసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఆయన్ను నా కళ్ల ముందు చూస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్లు అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

Yandamuri, KrishnaVamsi and Rajasekhar unveils Raj Madiraju Sira:

Raj Madiraju Sira Novel Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs