ఇదేంటి రాజకీయాలకు వల్లభనేని వంశీకి సంబంధముందన్న విషయం తెలుసు కానీ.. జూనియర్ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదూ..! అవును మీరు వింటున్నది నిజమే.. ఇప్పుడంటే రాజకీయాలకు ఆయనకు సంబంధం లేదు కానీ.. ఒకప్పుడు ఉంది.. తాతగారు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ తరఫున.. మామయ్య చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యాడు..? ఎందుకు దూరమయ్యాడు..? ఎందుకు దూరం కావాల్సి వచ్చింది..? అసలు కారణాలేంటి అనేది ఇప్పుడు అనవసరం.. అసందర్భం కూడా.! అయితే టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ.. తాజాగా ఎన్టీఆర్ గురించి మాట్లాడటంతో మరోసారి ఆయన హాట్ టాపిక్ అయ్యారు. వల్లభనేని వంశీకి.. జూనియర్‌కు మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం మళ్లీ గుర్తు చేయనక్కర్లేదు.
చిన్నబుక్‌లో ఎన్నెన్ని పాయింట్లో!?
గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వంశీతో మొదలైన పంచాయితీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆయన రాజీనామా చేసేశారు.. రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా చెప్పేశారు. ఇంతటితో పరిస్థితి సద్దుమణిగింది.. బహుశా ఇక వంశీ మీడియా ముందుకు కూడా రాడేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి.. అది కూడా చంద్రబాబు దీక్షరోజే మీడియా ముందుకు చంద్రబాబు మొదలుకుని.. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకూ అందరి గురించి మాట్లాడారు. బాబు, పవన్ గురించి ఏం మాట్లాడారు..? అనేది పక్కనెడితే.. ఇక్కడ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారన్నది పాయింట్. అంతేకాదండోయ్.. గట్టిగానే సుమారు చిన్నపాటి నోట్ బుక్‌లో పెద్ద పెద్ద పాయింట్లే రాసుకొచ్చి మరీ వంశీ చదవడం గమనార్హం.
ఈ ప్రశ్నలకు సమాధానమెక్కడ!?
‘2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు.. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్టీఆర్ కనిపించాడా..?. కారణమేంటి..? ఎన్టీఆర్‌ను ఆపిందెవరు..? పదేళ్ల క్రితమే కెరీర్‌ను ఫణంగా పెట్టి మరీ టీడీపీ కోసం ప్రచారం చేసిన జూనియర్.. మళ్లీ పదేళ్లు ఎందుకు కనిపించలేదు..? ఎందుకు నలకపూస అయిపోయాడు..?. నారా లోకేష్ కోసం ఎన్టీఆర్‌ను పక్కనెట్టిన మాట వాస్తవం కాదా..?’ అని టీడీపీ అధిష్టానంపై వంశీ ప్రశ్నల వర్షం కురిపించారు. బహుశా వంశీకి.. ఎన్టీఆర్‌కు.. చంద్రబాబుకు తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరి దగ్గరా దొరకవ్ అంతే.. ఆ లెక్కలకు చిక్కులు, చిక్కుముడులెన్నెన్నో ఉన్నాయ్.
యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందా!?
‘రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఇక నా బతుకేదో నన్ను బతకనీయండి బాబూ’ అంటూ ఎన్టీఆర్ సినిమాలు తీసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు. 2019 ఎన్నికలకు ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని.. మళ్లీ ప్రచారం చేయించాలని ఓ వైపు బాలయ్య.. మరోవైపు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ జూనియర్ ఆప్తుడు వంశీ ఇలా మాట్లాడటంతో ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతాడా..? లేకుంటే అబ్బే ఎవరేమనుకుంటే మనకేం అని మిన్నకుండిపోతాడా..? అని ఇటు సోషల్ మీడియాలో.. అటు టీవీ చానెల్స్.. నందమూరి అభిమానుల్లో చర్చనీయాంశమైంది. మరి జూనియర్ మనసులో ఏముందో ఎవరికెరుక..!