ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’లో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే.. ఎందుకంటే ఇప్పటికే బాహుబలి 1,2 చిత్రాలను తెరకెక్కించిన జక్కన్న.. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినీ ప్రియులు, నందమూరి-మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ భారీ చిత్రం తర్వాత ఈ ఇద్దరు కుర్ర హీరోలు ఏం చేయబోతున్నారు..? మరీ ముఖ్యంగా చెర్రీ పరిస్థితేంటి..? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇదే టైమ్‌లో మెగా కాంపౌండ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. పక్కా క్లాస్ చిత్రాలకు కేరాఫ్ డైరెక్టర్‌గా పేరుగాంచిన విక్రమ్ దర్శకత్వంలో చెర్రీ నటించబోతున్నారన్నది దాని సారాంశం.
ఇప్పటికే ‘13 బి’, ‘ఇష్క్’, ‘మనం’, ‘24’ చిత్రాలతో తన సత్తా ఏంటో చాటుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఆ తర్వాత అఖిల్‌తో తీసిన ‘హలో’ నిరాశ పరిచినప్పటికీ.. ‘గ్యాంగ్ లీడర్’తో తిరిగి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అయితే ఇదే ఊపుతోనే ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. ఇటీవలే ఈ విషయమై ఇద్దరూ కూర్చొని చర్చించారట. వాస్తవానికి చరణ్ ఎక్కువగా మాస్ ఇమేజ్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తారు.. మరోవైపు విక్రమ్ పక్కా క్లాస్ కథల్ని రాసుకుంటారన్న విషయం విదితమే. అయితే వీరిద్దరికీ ఎలా సెట్ అయ్యింది.. చెర్రీకి విక్రమ్ వినిపించిన ఆ లైన్ ఏంటి..? అనేది తెలియరాలేదు.. కానీ సింగిల్ లైన్‌కు మాత్రం చెర్రీ ఫిదా అయిపోయాడట. అంటే చెర్రీ నెక్స్ట్ సినిమా విక్రమ్‌తోనే అని పరోక్షంగా ఇద్దరూ చెబుతున్నారన్న మాట. అయితే ఆ స్టోరీ చెర్రీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటుందో..? మెగాభిమానులను ఏ మాత్రం మెప్పిస్తుందో..? అసలు మాస్-క్లాస్‌లు ఎలా కలుస్తాయో అనేది చూడాలని మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబోలో సినిమా ఎలా వర్కవుట్ అవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వేచి చూడాల్సిందే.