గత వారం ‘ఖైదీ’, ‘విజిల్’ సినిమాలు విడుదలైతే.. ‘ఖైదీ’కి పట్టం కట్టిన ప్రేక్షకులు ‘విజిల్’ని విసిరేశారు. ఇక ఈ శుక్రవారం మరో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి ‘అవును’, ‘నచ్చావులే’ డైరెక్టర్ రవి బాబు దర్శకత్వంలో సైలెంట్‌గా తెరకెక్కిన ‘ఆవిరి’ సినిమా ఒకటి. మరొకటి విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలు. అయితే రెండు సినిమాలు ఒకే లాంటి క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎవరి ప్రమోషన్ వారు చేసినా... ఈ రెండు సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి ఒకే రీతిలో ఉంది.
మీకు మాత్రమే చెప్తా సినిమాకి విజయ్ దేవరకొండ కేవలం నిర్మాతే. మరి హీరో అయితే ఆ క్రేజే వేరు. కానీ నిర్మాత గా చేసిన సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక తరుణ్ భాస్కర్ హీరో గా ఎవరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా... ఈ సినిమాలో మరో మెయిన్ ఎస్సెట్ అనసూయ హీరోయిన్ గా నటించడం. మరి కేవలం విజయ్ ని చూసి సినిమాకెళ్ళేవారు ఎంత మంది అనేది ఆ సినిమా టాకే చెబుతుంది. ఇక నచ్చావులే లాంటి లవ్ స్టోరీతో ఇరగదీసిన రవిబాబు, అవును సినిమా తో కొట్టిన హిట్ తర్వాత ఇంతవరకు హిట్ సినిమానే చెయ్యలేదు. అయితే ఆవిరి సినిమా టీజర్ చూసాక సినిమాలో విషయముంది అని.. సినిమా చూసేందుకు ఎంతమంది కదులుతారో అనేది మాత్రం సినిమా ఫస్ట్ షో టాక్ ని బట్టి ఉంటుంది. మరి ఈ వారం మీకు మాత్రమే చెబుతా గెలుస్తుందో? లేదంటే ఆవిరి గెలుస్తుందో? చూడాలి.