టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నటులు, కమెడియన్స్, ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ వెలుగు వెలిగిన తారలు, ఇలా ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నారు. తాజాగా.. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సీనియర్ నటి ఇకలేరన్న వార్త తెలుసుకున్న టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు సీనియర్ నటీనటులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.
1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అలియాస్ మణి 1967లో సీతారామ కల్యాణం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి మెప్పించారు. ఇలా పలు హిట్ చిత్రాల్లో గీతాంజలి నటించారు. ‘సీతారామ కల్యాణం’, ‘కలవారి కోడలు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మురళీకృష్ణ’, ‘కాలం మారింది’ సినిమాలతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో గీతాంజలి, పద్మనాభం హిటపెయిర్‌గా నిలిచారు. సహనటుడు రామకృష్ణను ప్రేమించి ఆమె వివాహం చేసుకున్నారు. గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాలలో కూడా నటించారు.
‘పారస్ మణి’ అనే హిందీ చిత్రంలో పనిచేస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని నామకరణం చేశారు. ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయారు. వివాహం అనంతరం ఈమె సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. సినీ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరారు. చివరగా అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో గీతాంజలి కనిపించారు.