గత కొంతకాలంగా అంటే.. నరేష్ మా అధ్యక్షుడు అయిన దగ్గరనుండి అధ్యక్షుడు నరేష్ కి మా మెంబెర్స్ కి మధ్యన విభేదాలు తలెత్తడం, అవి చిలికి చిలికి గాలివానలా మారి.. రెండు వర్గాలుగా చీలిపోయి.. ఓ వర్గం రాజశేఖర్ - జీవితాల వర్గంగా , రెండో వర్గం మా అధ్యక్షుడు నరేష్ వర్గంగా మా లో చీలికలు ఏర్పడ్డాయి. రాజశేఖర్ జీవితలతో కలిసి కొంతమంది నరేష్ ని మా అధ్యక్ష పీఠం నుండి గద్దె దించే ఏర్పాట్లు చేస్తుండగా.. నరేష్ కూడా వారికీ తగిన విధంగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మా నిధుల విషయం, అలాగే మా అధ్యక్షుడు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో మా సభ్యులైన రాజశేఖర్ టీమ్ ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చెయ్యడంతో.. నరేష్ వర్గానికి రాజశేఖర్ వర్గానికి మధ్యన మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.
అయితే దాసరి ఉన్నప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అయన చాలా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీని నడిపే పెద్ద దిక్కుగా చిరంజీవి ఉంటే బాగుండు అని అందరూ భావిస్తున్నారు. అయితే మా లో ఇంత గొడవ జరుగుతున్నపటికి.. చిరు ఇప్పటివరకు మౌనం వహించారు. కానీ తాజాగా చిరంజీవి మా లో విభేదాలను చక్కదిద్దే ఏర్పాట్లను చేస్తున్నట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. దీనిలో భాగంగా మా లో విభేదాలు తలెత్తిన ఇరు వర్గాలను తన ఇంటికి పిలిచి మాట్లాడి సమస్యకు చెక్ పెట్టడానికి చిరు రెడీ అవుతున్నారు.