టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇంటికెళ్లి బెదిరించడం, పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయడం వరకూ వెళ్లాయి. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్.. జూబ్లిహిల్స్ పోలీసులు బుధవారం సాయంత్రం బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం జూబ్లిహిల్స్ నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించారు.
కాగా.. 420, 448, 506, ఐపీసీ సెక్షన్ 43 కింద బండ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడు. వాస్తవానికి ఈ వివాదానికి ఎప్పుడో ఫుల్‌స్టాప్ పడుతుందని అందరూ భావించారు. అయితే ఇది సామరస్యంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరికేదేమో కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మరి మున్ముంథు ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో ఏంటో.!
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్‌లోని వైసీపీ నేత పీవీపీ ఇంట్లో అర్ధరాత్రి గణేష్ నానా రచ్చ చేసిన విషయం విదితమే. తన అనుచరులతో కలిసి పీవీపీని బెదిరించడంతో ఆయన.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పై ఇద్దరూ ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పీవీపీ.. కేశినేని నాని చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.