టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరుగాంచిన దిల్‌రాజు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారా..? సూపర్‌హిట్ చిత్రాల నిర్మాతగా టాలీవుడ్‌లో రాణించిన దిల్ రాజు.. ఇక రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారా..? ఇప్పటికే ఒకట్రెండు సార్లు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావించిన దిల్‌రాజు ప్రయత్నాలు.. బీజేపీ రూపంలో ఫలించనున్నాయా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దిల్‌రాజు ఢిల్లీ వేదికగా కాషాయ కండువా కప్పుకోనున్నారా..? అంటే తాజా పరిణామాలు, కొన్ని రోజులుగా దిల్‌రాజు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
2014, 2018లో రెండు సార్లు ఓ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించినప్పటికీ దిల్‌రాజు ప్రయత్నాలు ఫలించలేదని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బలపడి అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. బడా నిర్మాత, బాగా డబ్బులున్న బిజినెస్‌మెన్ దిల్‌రాజుకు గాలం వేసిందని సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పించడమే కాకుండా.. ఏ టికెట్ కోరుకున్నా (ఎంపీ, ఎమ్మెల్యే) రెండూ వీలుకాకపోయినా రాజ్యసభకు అయినా పంపుతామని ఓ కేంద్ర మంత్రి హామీ ఇచ్చారట.
ఈ క్రమంలో ఢిల్లీకి తీసుకెళ్లి మరీ ప్రధాని మోదీతో ఇటీవల షేక్ హ్యాండ్ ఇప్పించారట. ఇటీవల గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ.. సినీ సెలబ్రిటీలకు విందు ఇవ్వగా బాలీవుడ్ తారలు మాత్రమే హాజరవ్వగా.. సౌత్ నుంచి దిల్‌రాజు మాత్రమే వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆ కేంద్ర మంత్రి బీజేపీలో చేర్పించడంలో భాగంగా.. ఈ భేటీలో మోదీని కలిపించారని తెలుస్తోంది. అయితే ఈ భేటీ తర్వాత మోదీని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేయడం.. మోదీని కలవడం తనకు దక్కిన అరుదైన గౌరవమని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఈ పుకార్లకు మరింత బలం చేకూరుతోంది. మొత్తానికి చూస్తే దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ మాత్రం పక్కా అని తెలుస్తోంది కానీ.. ముహూర్తం ఎప్పుడో మరి అనేది వేచి చూడాల్సిందే మరి.