టాలీవుడ్‌లో ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలన్నీ వివాదంలో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే ‘వాల్మీకి’, ‘సైరా’ చిత్రాల విషయంలో వివాదం చెలరేగడం.. కోర్టు మెట్లెక్కడం.. డబ్బులు డిమాండ్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. మరీ ముఖ్యంగా ‘సైరా’ విషయంలో అయితే చాలా పెద్ద పంచాయితీనే జరిగింది. ఇంత పెద్ద సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని దర్శకనిర్మాతలు ఒకానొక సమయంలో టెన్షన్ పడ్డారు కూడా. అయితే సమస్యలన్నీ సాఫీగా పరిష్కరించుకోవడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు లేకుండా పోయాయ్.. ఇప్పుడే ఇదే సైరా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు.
అయితే తాజాగా ఇదే తరహాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’ పై కూడా వివాదం చెలరేగింది. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆర్ఆర్ఆర్ సినిమాపై అభ్యంతరాలు తెలుపుతోంది. అల్లూరి సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని.. అది రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు కథ ఇదీ...!
‘అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. వీరిద్దరికీ పరిచయం ఉన్నట్లు కానీ.. స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదు. అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్దతి కాదు. చరిత్రను వక్రీకరిస్తే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి’ అని రాజమౌళికి వీరభద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వ్యవహారంపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.