నారా లోకేష్ ఈ మధ్య ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ.., ఆయన చేసే ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒక్క రాజకీయాలనే కాకుండా స్పోర్ట్స్, సినిమా, ఇతరత్రా విషయాలపై కూడా లోకేష్ స్పందిస్తూ తన ఉనికిని చాటుతున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు.
ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్ @KonidelaPro, చిత్ర దర్శకులు @DirSurender, సాంకేతిక సిబ్బంది.. యూనిట్ మొత్తానికీ హార్దికాభినందనలు..’’ అంటూ నారా లోకేష్.. సైరా సినిమా గురించి తన ట్వీట్‌లో తెలిపారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ట్వీట్ చేయడం అనేది నందమూరి అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు రుచించడం లేదు. తమ అభిమాన హీరో నటించిన సినిమాలపై ఇప్పటి వరకు ఒక్క ట్వీట్ కూడా చేయని లోకేష్‌కు ఇప్పుడు చిరంజీవి కావాల్సి వచ్చాడా.. అంటూ కొందరు ఈ ట్వీట్‌కు స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం ‘‘ఎటువంటి స్వార్థం లేకుండా, సినిమా వేరు రాజకీయం వేరు అని ఎంతో గొప్పగా ఆలోచించి ఎటువంటి భేషజాలు పోకుండా సినిమా పరంగా మీకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాజకీయంగా ఏనాడు పవన్ కళ్యాణ్‌గారిని ఒక్క మాట తప్పుగా అనలేదు, అదీ ఆయన గొప్పతనం’’ అంటూ లోకేష్‌ను అభినందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కూడా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపింది.