టాలీవుడ్‌లో ఉండే హీరోలందరూ ఒక్కటే అని, వారి మధ్య ఎటువంటి భేదాలుగానీ, హెచ్చుతగ్గులుగానీ ఉండవని చెబుతుంటారు. హీరోలు కూడా ఈ మధ్య ఫంక్షన్లలో ఇదే తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక హీరో సినిమా విడుదలైనప్పుడు ఇతర హీరోలు ప్రశంసించడం, ఒక హీరో నటించిన చిత్ర ఫంక్షన్‌కు మరో హీరో హాజరవ్వడం వంటివి ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, మెగా నందమూరి కుటుంబాల మధ్య మాత్రం వార్ ఉందనేది తాజాగా విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర విషయంలో తెలుస్తుంది.
ఎలా అంటే.. ఈ చిత్రం విడుదలై మొదటి షో నుండే మంచి టాక్‌తో పాటు, గొప్ప సినిమా అని, ఈ వయసులో కూడా చిరంజీవి ఎంతగానో కష్టపడ్డాడని అంతా ప్రశంసిస్తుంటే.. నందమూరి హీరోలెవరూ ఇంత వరకు దీనిపై స్పందించకపోవడం విశేషం. ఆఖరికి మోహన్ బాబు కూడా తన మిత్రుడు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపాడు. మహేష్ బాబు, శ్రీకాంత్.. ఇలా ఒక్కరేమిటి.. ప్రతి ఒక్కరూ ‘సైరా’పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ నందమూరి హీరోలలో ముఖ్యంగా బాలకృష్ణ మాత్రం ఇంతవరకు ఈ సినిమాపై ఎటువంటి కామెంట్ చేయలేదు. మరి బాలయ్యకు ఇంత మొండి పట్టు ఏమిటో అనేది ఎవరికీ అర్థం కాలేదు.
ఈ విషయంలో చిరంజీవి తగ్గుతున్నా.. బాలకృష్ణ మాత్రం ప్రతిసారి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ.. తన ధోరణి ప్రదర్శిస్తూనే ఉన్నారు. బాలయ్య నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర ఓపెనింగ్‌కు చిరంజీవి హాజరవ్వడమే కాకుండా, ఆ సినిమా విడుదల తర్వాత ఆయన హాజరైన రెండు మూడు ఫంక్షన్లలో కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. అలాగే బాలయ్య నటించిన ‘సింహా’ చిత్ర విజయాన్ని కూడా చిరు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. మరి చిరంజీవికి లేని బెట్టు.. బాలయ్యకు ఎందుకో? ఇంకా బాలయ్య ఏం చూసుకుని ఇలా ఒకవైపే చూస్తున్నాడో అనేది.. ఇండస్ట్రీ వర్గాలకైతే అర్థం కాని ప్రశ్న.