అభిషేక్, ప్రజ్వల్ కుమార్, మధు ప్రియ, పూజిత హీరో హీరోయిన్లుగా దర్శకుడు రవి ములకలపల్లి రూపొందిస్తున్న సినిమా శీను, వేణు. వీళ్లు మంచి కిడ్నాపర్స్ అనేది ఉపశీర్షిక. గడ్డం కృష్ణ సమర్పణలో వసుంధర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శీను వేణు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతలు సి కళ్యాణ్, రామసత్యనారాయణ, విద్యావేత్త రాజు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ... ఈ సిినిమా పాటలు బాగున్నాయి. కొత్త వాళ్లైనా నటీనటులు బాగా చేశారు. చిన్న చిత్రాలు రూపొందించేటప్పుడు మంచి కథా కథనాలు ఉండేలా చూసుకోవాలి. కంటెంట్ బాగా లేకుంటే ఎవరూ చూడరు. ఆ తర్వాత చిన్న సినిమాకు థియేటర్ లు దొరకలేదంటారు. జాగ్రత్తగా తెరకెక్కించాలి. ఇవాళ చిన్న సినిమాలను థియేటర్ లకు వెళ్లి చూస్తే పది మంది కూడా ఉంటడం లేదు. ఈ సినిమా ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.
మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న కాలమిది. రవి సంగీత దర్శకుడే కాదు, మంచి దర్శకుడు అని కూడా నిరూపించుకుంటున్నాడు. ఈ సినిమా విజయం సాధించి, ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు ములకలపల్లి రవి మాట్లాడుతూ... పల్లెటూరి నేపథ్యంతో సాగే చిత్రమిది. ఊరిలో గొర్రెలు కాసే ఇద్దరు అమ్మాయిలు అపహరణకు గురవుతారు. వాళ్లను ఆ ఊరి నుంచి ముంబై అక్కడి నుంచి దుబాయ్ కు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంటుంది. ఆ అమ్మాయిలను హీరోలు ఎలా రక్షించారు అనేది కథాంశం. వినోదం, భావోద్వేగాలతో కథ సాగుతుంది. మా వసుంధర క్రియేషన్స్ లో మొదటి చిత్రమిది. మీ ఆదరణతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం. అన్నారు.
హీరో అభిషేక్ మాట్లాడుతూ... మా అందరికీ పేరు తెచ్చేలా సినిమా చేశారు దర్శకుడు రవి గారు. మాకిది మొదటి చిత్రమైనా ఐదారు సినిమాలంత అనుభవం ఇచ్చారు. అన్నారు.
హీరో ప్రజ్వల్ కుమార్ మాట్లాడుతూ... నాకు తెలుగు భాష రాదు, ఇక్కడి వ్యవహారాలు తెలియవు. అయినా నేనున్నా అంటూ ధైర్యం చెప్పి రవిగారు నాతో ఈ పాత్ర చేయించారు. ఆయనకు థ్యాంక్స్. అన్నారు.