సినిమా అంటే ఒకప్పుడు ఒక పండగ వాతావరణం. తమ అభిమాన హీరో సినిమా ముఖ్యంగా చిరంజీవి సినిమా విడుదల అవుతుంది అంటే చాటు పల్లెటూర్లలో ఎడ్ల బండ్లలో జనం తమ దగ్గరలో ఉన్న థియేటర్లకు తరలి వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సినిమా విడుదలైన కొన్ని గంటలలోనే పైరసీ ప్రింట్ వచ్చేయడంతో.. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇక బళ్లు వేసుకుని మరీ పల్లె ప్రజలు సినిమాలకు వెళ్లే రోజులు మరిచిపోయి చాలాకాలమే అవుతుంది. మళ్లీ అలాంటి రోజులను తీసుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఆయన రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత నిజం చెప్పాలంటే టాలీవుడ్‌లో సరైన క్రమశిక్షణ కొరవడిందనే చెప్పాలి. మళ్లీ ఆయన ముఖానికి రంగేసుకుని ఎప్పుడైతే సందడి చేశారో.. ప్రేక్షకులలో కూడా ఏదో తెలియని సంతృప్తి మెగాస్టార్ మళ్లీ వచ్చేశాడని. సరిగ్గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం.. ప్రేక్షకులలో చాలా మార్పును తీసుకువస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని పల్లె ప్రజలు అనుకుంటుండటం విశేషం. పండగ కూడా కలిసి రావడంతో సరదాగా పల్లె ప్రజలు ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలని భావిస్తున్నారట. ట్రాక్టర్లలో (ఇప్పుడు ఎండ్ల బండ్లు అక్కడ కూడా లేవు) వెళ్లి పట్టణంలో ఉన్న థియేటర్‌లో ఈ సినిమాని చూడాలని పల్లె ప్రజలంతా అనుకుంటున్నారని.. ఈ మధ్య మెగాభిమానులు సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో తేలింది. సో.. మెగాస్టార్ చిరు మళ్లీ ఆ రోజుల్ని తీసుకురాబోతున్నారన్నమాట.