మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడిన ఈ చిత్రం.. విడుదలకు ముందు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఈ చిత్రంపై రాద్ధాంతం చేస్తూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోట్లు డిమాండ్ చేస్తూ.. ‘సైరా’ యూనిట్‌కు చివరి నిమిషంలో చెమటలు పట్టించినా.. కోర్టు మాత్రం ‘సైరా’ చిత్రానికి ఎటువంటి అడ్డంకులూ లేకుండా ఉండేలా తీర్పును వెల్లడించింది. అయితే ఈ విషయంలో నరసింహారెడ్డి వారసులపై ప్రతి ఒక్కరూ నెగిటివ్ కామెంట్లు చేశారు. చరిత్రలో మరుగున పడిన తమ కుటుంబ చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్న చిత్రాన్ని అడ్డుకోవాలని చూడటం నిజంగా వారి మూర్ఖత్వమే అనేలా ప్రతి నోటా మాటలు వినిపించాయి.
అయితే ఈ విషయంపై స్పందించిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా మెగాస్టార్ మా తాతో, ముత్తాతో చరిత్రని సినిమాగా తీస్తే.. చిరంజీవి, చరణ్‌లు కాళ్లు కడిగి, ఆ నీళ్లను నెత్తిమీద చల్లుకునేవాడినని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరో నిజంగా నాకు తెలియదు. కానీ మెగాస్టార్ చిరంజీవిగారు సినిమా చేస్తున్నారని తెలియగానే, మొట్టమొదట స్వాతంత్ర్య సమరయోధుడు ఆయనని తెలిసింది. మరి అలాంటి గొప్ప చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పబోతుంటే, చివరి నిమిషంలో అడ్డుకుని, డబ్బులు డిమాండ్ చేయడం నిజంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చరిత్రను అవమానించడమే అని ఓ ఇంటర్వ్యూలో హరీష్ అన్నారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటివి బాగా పెరిగిపోయాయని, తమ చిత్రం కూడా ఇంకో ఆరుగంటలలో విడుదలవుతుంది అన్నప్పుడు ఎన్నో కష్టాలు సృష్టించారని, ఇలాంటివి ఇకనైనా ఆపాలని ఆయన హెచ్చరించారు. ఇలాంటి కుసంస్కృతికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.