టాలీవుడ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. ఇటు రాజకీయాలు, అటు సినిమాలు బాగానే బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఓ లెక్క.. ఎన్నికల ఫలితాల తర్వాత ఓ లెక్క.. ఒక్క మాటలో చెప్పాలంటే పృథ్వీ పొలంలో ఇప్పుడు మొలకలొచ్చాయ్.!. ఈయన మీడియా ముందుకొస్తే రాజకీయనేతలను.. సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను ప్రతీసారి ఎటాక్ చేస్తూ వస్తుండేవారు. ఆఖరికి ఎన్నికల ఫలితాలు వెలువడి.. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత కూడా పృథ్వీ మాత్రం ఈ విమర్శలు ఆపలేదు. అయితే ఆ తర్వాత పోసాని, రాజేంద్రప్రసాద్ లాంటి పెద్దలు రియాక్ట్ అవ్వడం.. మీడియా ముందుకు రావడం అన్నీ జరిగిపోయాయ్. దీంతో కాసింత ఆయన నోరు తగ్గించుకున్నారు.
అంతేకాదు అప్పట్లో.. మెగా ఫ్యామిలీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో మెగా హీరోలంతా పృథ్వీని బ్యాన్ చేసినట్లు కూడా వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇక పృథ్వీ ప్యూచర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లేనని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఆయన స్పందించడం కాసింత క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. అయితే ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీని వైఎస్ జగన్ నియమించిన తర్వాత ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ మాట్లాడిన మాట తీరును బట్టిచూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు మెగా ఫ్యామిలీపై నిప్పులు చెరిగిన పృథ్వీ.. ఒక అడుగు వెనక్కి తగ్గి మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేయడం చూస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే మెగా ఫ్యామిలీని చెడ్డ చేసుకోకుండా.. మంచిగా మెలుగుతూ ఉండాలని నిర్ణయించారట. అందుకే ఇటు వైఎస్ జగన్.. అటు మెగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నాడట. పృథ్వీలో వచ్చిన మార్పు మంచిదేనని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగేయాలని ఆయన ఆప్తులు ఒకరిద్దరు సూచించడంతో తన తీరును మార్చుకున్నట్లు తెలుస్తోంది.