మెగాహీరో వరుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేశ్’. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు కలెక్షన్లు కూడా గట్టిగానే రాబట్టింది. అయితే ఆఖరి నిమిషంలో సినిమా మార్చడంతో మెగాభిమానులు, సినీ ప్రియులు కాసింత అసంతృప్తికి లోనయ్యారు. అంతేకాదు.. డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టేశారు కూడా! ఈ సినిమా మార్పు వెనుక ఎవరున్నారా..? అని లోతుగా పరిశీలించగా వైసీపీ ఎంపీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాస్తవానికి ‘వాల్మీకి’ సినిమా పేరును మార్చాలని ఇప్పటికే పలుమార్లు నిరసనలు, ధర్నాలు కూడా సంబధిత కులస్థులు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సినిమా షూటింగ్‌ను కర్నూలులో జరగకుండా ఆపారు కూడా. ఎన్ని చేసినప్పటికీ బోయ, వాల్మీకి కులస్థుల ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఇదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎంపీ తలారి రంగయ్యకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగయ్య రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది.
మూడో కంటికి తెలియకుండా వైసీపీ ఎంపీ.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలవడం.. సినిమా టైటిల్ మార్చి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ‘వాల్మీకి’ లాంటి మహనీయుడి పేరును ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ఈ చిత్ర యూనిట్‌పై కేసులు, కోర్టులో పిటిషన్లు, ధర్నాలు, నిరసనలతో సదరు సామాజిక వర్గం వారు హోరెత్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో రంగయ్య కీలక పాత్ర పోషించారని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే.. ఈ వాల్మీకి పేరును ‘గద్దలకొండ గణేశ్’ గా మార్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన రంగయ్య.. ఈ సినిమాను స్వాగతిస్తున్నామని తెలిపారు. అంతటితో ఆగని రంగయ్య తనకు ఎలాంటి మచ్చ అంటుకోకుండా.. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని చిన్నమాటతో సరిపెట్టుకున్నారు.