సెప్టెంబర్ 20న ‘వాల్మీకి’ సినిమాలో వరుణ్ నట విజృంభన చూస్తారు - మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్
‘షాక్’, ‘మిరపకాయ్’ ,‘గబ్బర్‌సింగ్’, ‘డీజే’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్, ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ హీరో అధర్వ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజ హెగ్డే ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్న సందర్భంగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూ.
ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది?
- నేను వరుణ్‌ని దాగుడు మూతలు స్క్రిప్ట్ పనిమీద కలిశాను. ఆ టైమ్ లోనే వరుణ్ నాతో ఈ స్క్రిప్ట్ నాతోనే ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అని అడిగాడు.. ‘తొలిప్రేమ’, ‘ఫిదా’ లాంటి సినిమాలు చేస్తున్నావు కదా నాకు కొత్తగా ఉంటుంది అన్నాను. దానికి వరుణ్ నేను మీతో మీ టైప్ సినిమాలు చేస్తాను అప్పుడు నాకు కొత్తగా ఉంటుంది అని అన్నారు. ఆ టైమ్ లోనే కార్తిక్ సుబ్బరాజన్ ‘పేట’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. ఆయన సినిమాలు బాగుంటాయి కదా అని ‘జిగర్తాండ’ సినిమా చూశాను. బాగా నచ్చడంతో ఈ సినిమాను రీమేక్ చేద్దాం అని అనుకోవడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.
తమిళ మాతృకలో ఎలాంటి చేంజెస్ చేశారు?
- ‘దబాంగ్’ సినిమాను ‘గబ్బర్‌సింగ్’ గా చేసినన్ని మార్పులు ఈ సినిమాలో చేయలేదు. ఎందుకంటే ‘జిగర్తాండ’నే బ్యూటిఫుల్ కంటెంట్. ఆ స్క్రీన్ ప్లే, కంటెంట్ అంటేనే నాకు చాలా ఇష్టం. నేటివిటీకి సంబంధించి చిన్న చిన్న చేంజెస్ చేశాను. అలాగే అక్కడ బాబీ సింహ చేసిన క్యారెక్టర్‌ను వరుణ్ క్యారక్టరైజేషన్‌కి సరిపోయేటట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది.
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
- ఒక మనిషి యొక్క అత్యున్నతమైన మార్పుకి ‘వాల్మీకి మహర్షి’ గొప్ప నిదర్శనం. ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది హైలెట్‌గా ఉంటుంది. ఈ సినిమా కథే అది అవడంతో ఈ టైటిల్‌నే ఫిక్స్ చేశాం.
పూజ హెగ్డే క్యారెక్టర్ గురించి?
- సెకండ్ హాఫ్‌లో వచ్చే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ ఒక్క క్యారెక్టర్ ఆడియన్స్‌కి సస్పెన్స్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. అందుకే దాని ఇప్పుడే రివీల్ చేయడం లేదు. సినిమాలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే..
చాలా పాటలు ఉండగా ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటనే ఎందుకు రీమిక్స్ చేశారు?
- ఈ సినిమాలో పూజ హెగ్డే క్యారెక్టరైజెషన్ కానీ, ఆ సాంగ్ కానీ కథ డిమాండ్ మేరకే పెట్టడం జరిగింది తప్ప ఎదో కమర్షియల్‌గా ఒక రీమిక్స్ పాట పెట్టాలని కాదు. అలా అనుకుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి సాంగ్సే బోలెడు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ ఉంటాయి. అయినా నా అన్ని సినిమాల కంటే ఎక్కువ లెంగ్త్‌తో వస్తోంది అంటే కంటెంట్ ఎక్కువగా ఉండబోతుంది.
వరుణ్ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- వరుణ్ హీరో అవ్వక ముందు నాగబాబు గారు కొన్ని ఫొటోస్ పంపారు. ఆ ఫొటోల్లో వరుణ్ ఇంచుమించు ఇలానే కనిపిస్తాడు. ఆ ఫొటోస్ నా మనసులో ఉండడంతో వరుణ్‌కి ఆ లుక్ బాగుంటుందని దాదాపు ఆరు నెలలు గడ్డం పెంచి ఈ ప్రాపర్ లుక్‌లోకి తీసుకురావడం జరిగింది.
మరో క్యారెక్టర్ కోసం అధర్వ మురళినే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి?
- తెలుగులో కూడా చాలా మంది టాలెంటెడ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. మేము కూడా కొంతమందిని ఆడిషన్ చేయడం జరిగింది. కాని సినిమాలో ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్‌లా కనిపించాలి. అలాగే మంచి యాక్టర్ అయ్యి ఉండాలి అనుకున్నపుడు అధర్వని చూసి సెలక్ట్ చేశాం.
మిక్కీ జె మేయర్ క్లాసిక్, మెలోడి పాటలకు ప్రసిద్ధి కదా! మాస్ సినిమాకు అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
- మిక్కీతో నేను ‘సుబ్రమణ్యంఫర్‌సేల్’ సినిమా చేశాను. కాని ప్రాపర్‌గా అతనితో వర్క్ చేయలేకపోయా.. ఆయనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే ఇంకా బాగా చేయగలుగుతాడు అనిపించింది. అందుకే ఈ సినిమాకు ఆయన్ని సెలెక్ట్ చేశాను.
14 రీల్స్ ప్లస్ బేనర్ గురించి?
- రామ్ ఆచంటగారు, గోపి ఆచంటగారు ‘నమో వేంకటేశ’ సినిమా చేయకముందు నుండి నాకు పరిచయం. చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఈ 14 రీల్స్ ప్లస్ బేనర్ నా సినిమాతో స్టార్ట్ అవడం సంతోషంగా ఉంది.
పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నారు అని గట్టిగా వినిపిస్తుంది?
- ఫ్యాన్స్‌తో పాటు మీరు కూడా సినిమా త్వరగా జరగాలని కోరుకోండి. తప్పకుండా జరుగుతుంది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా అని వెయిటింగ్. ఒక వారం క్రితం పవన్‌కళ్యాణ్ గారిని కలిసి ట్రైలర్ చూపించాను. చాలా బాగుంది హరీష్ అన్నారు.
ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ గురించి?
- ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చిన్న క్యారెక్టర్ చేశారు. అలాగే సుకుమార్ గారు కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తారు. సత్య మరోసారి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో బాగా చేశాడు. మరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఛాయ్ బిస్కెట్‌లో చేసే అరుణ్ చేశారు. వరుణ్ డెడికేషన్, కమిట్ మెంట్ షూటింగ్ టైమ్‌లో చూశా. 85 రోజులు షూట్ చేస్తే 85 రోజులు నవ్వుతూ చేసిన నా మొదటి హీరో వరుణ్.
రీమేక్ సినిమాలకు మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుందా?
- నేను 2012 తరువాత మళ్ళీఇప్పుడే రీమేక్ చేస్తున్నా. నా దృష్టిలో అన్ని సినిమాలు రీమేక్‌లే. ఒక సినిమాకి ఒక పుస్తకం, ఒక నవల, ఒక వ్యక్తి, ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఒక సినిమాకు ఇంకో సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనేది నా భావన. ఒక సినిమా ప్రేమికుడిగా నాకు నచ్చిన ఏ సినిమా నైనా రీమేక్ చేస్తాను.
మెగా ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు?
- వరుణ్ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి నేను చెప్పేది ఏంటంటే.. సెప్టెంబర్ 20న ‘వాల్మీకి’ సినిమాలో వరుణ్ యొక్క నట విజృంభన చూస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్. క్లైమాక్స్‌లో వరుణ్ నేను ఊహించుకున్నదానికంటే ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. సినిమా అయిపోయాక 5 సంవత్సరాల తర్వాత నేను వరుణ్ ఎప్పుడు ‘వాల్మీకి’ గురించి మాట్లాడుకున్న మాకు గర్వంగా అనిపించే విధంగా సినిమా ఉంటుంది.
మీరు ఫ్యూచర్‌లో సినిమాలు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా?
- తప్పకుండా ఉంది. తెలుగులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మంచి కంటెంట్ సినిమాలు వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. నేను రైటింగ్, డైరెక్షన్ లో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కడినే ప్రొడ్యూస్ చేయలేను. అందుకే ‘జవాన్’ ప్రొడ్యూసర్ కృష్ణ గారితో, మహేష్ ఎస్ కోనేరు ఇంకా ఇద్దరుముగ్గురు స్నేహితులు ఉన్నారు వారితో కలిసి ప్రొడ్యూస్ చేస్తాను.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- 2, 3 ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ‘వాల్మీకి’ విడుదలయ్యాక వాటిగురించి చెప్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్