కెరియర్ ఆరంభంలో కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలు చేసిన బండ్ల గణేశ్, ఆ తర్వాత నిర్మాతగా మారిపోయి పెద్ద పెద్ద సినిమాలు తీసిన విషయం విదితమే. కమెడియన్, నిర్మాతగా విజయవంతమైన బండ్ల.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పాలిటిక్స్‌లోకి దిగిన ఆయన.. పట్టుమని పదిరోజులు కూడా ఉండలేకపోయారు. అప్పటి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకున్న గణేష్.. రాజకీయాల గురించి లోతుగా తెలుసుకున్నాక.. గుడ్ బై చెప్పేసి బయటికొచ్చేశారు.
అయితే.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో మళ్లీ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమా షూటింగులో బండ్ల జాయిన్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో బండ్ల పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. బండ్ల ఓ పెద్ద కోటీశ్వరుడట. డబ్బులు మాత్రం కోట్లలో ఉన్నప్పటికీ కనీసం జ్ఞానం కూడా ఉండదట. ఒక్క మాటలో చెప్పాలంటే బండ్ల ‘పప్పు సుద్ద’లా ఉంటాడట. ఈ క్యారెక్టర్‌తో జనాలు పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటారట. మరీ రీ ఎంట్రీతో వస్తున్న బండ్ల గణేష్ కామెడీ పండిస్తాడో.. లేకుంటే సీట్లలో నుంచి జనాలను బయటికి పంపిస్తాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.