పూరి జగన్, బోయపాటి శీను సంయుక్తంగా విడుదల చేసిన ఆలీ ‘పండుగాడి ఫోటో స్టూడియో’ మూవీ ఆడియో
ఆలీ మరోసారి హీరోగా పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి రూపొందించిన ఈ చిత్ర ఆడియో వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆడియో సిడీని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను సంయుక్తంగా విడుదల చేశారు. ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకలో ముఖ్య అథితులుగా బాపట్ల ఎమ్.పి. నందిగాం సురేష్, హీరో శ్రీకాంత్, సీనియర్ నటుడు నరేష్, అల్లరి నరేష్, బాబు మోహన్, ఛార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత గుదిబండి సాంబిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ ఆడియో వేడుకకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కొల్లిపరలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం.. జూనియర్ కళాశాలగా ప్రారంభమై.. నేడు తెనాలి, పొన్నూరు, గుంటూరు, విజయవాడలలో 25 కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో ప్రస్తుతం జూనియర్, డిగ్రీ, బిఈడీ, డిఈడీ, డిఎన్ఎమ్, పిపిటి నర్సింగ్ మొదలగు కోర్సులతో ఈ కళాశాలలను విజయవంతంగా రన్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా మా బ్యానర్‌లో అలీగారి అనుబంధంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి ఆనందించి, ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా బ్యానర్‌లో రెండో చిత్రంగా స్టార్ హీరో మమ్ముట్టిగారు నటించిన చిత్రంతో సెప్టెంబర్‌లో మీ ముందుకు రానున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘‘రెండు సంవత్సరాలు ఈ కథ కోసం కష్టపడ్డాను. ఈ కథను దర్శకుడు సుకుమార్ ఓకే అన్న తర్వాతే తెరకెక్కించడం జరిగింది. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ చిత్రం ఉంటుంది. ఆలీగారు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే... పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లై పోతుంది అనేది కాన్సెప్ట్. సీన్ టు సీన్ కామెడీ ఉండేలా రాసుకున్నాను. చిన్న సినిమాలలో కూడా క్వాలిటీని చూపించే లొకేషన్స్ ఉన్నాయి మా ఏరియాలో, అందుకే ఈ సినిమా షూటింగ్ మొత్తం తెనాలిలో చేశాము. పాటలు మాత్రం అరకులో చిత్రీకరించాము. యాజమాన్య అందించిన సంగీతం ఆహ్లాదంగా ఉంటుంది. అలానే మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే తెనాలి అనే సాంగ్ కూడా ఉంది. చెప్పాలంటే పండుగాడు ఫోటో తీస్తే పెళ్లై పోద్ది... ఈ సినిమా చూస్తే గ్యారంటీగా నవ్వు మీ వశమవుద్ది.. అని గ్యారంటీగా హామీ ఇస్తున్నాను..’’ అన్నారు.
హీరో అలీ మాట్లాడుతూ... నా మీద అభిమానంతో ఈ వేడుకకు వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా గురుంచి మాట్లాడాలంటే.. ఒక రోజు ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఏదో ఇన్ కమ్ టాక్స్ విషయం ఏమో అనుకున్నా కానీ... నా ఫ్రెండ్ ఒకరు సినిమా చేస్తున్నారు మీరు అందులో యాక్ట్ చేయాలని అడిగారు. ఆ ఆఫీసరు ఫ్రెండే ఈ దిలీప్ రాజా అని తెలిసింది. కట్ చేస్తే... నాకు మొదట కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పాను. కథ కూడా చాలా బాగుంది. నిర్మాత వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాపై ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నా అన్నారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
ఆలీ, రిషిత, వినోదకుమార్, బాబుమోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మీ రాంజగన్, చిత్రం శ్రీను, టీనా చౌదరి, సందీప్ రాజా, జబర్దస్త్ రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి సహా నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్:షా వాలిన్, మల్లేష్, డాన్స్: రఘు మాస్టర్, అజయ్, శివశంకర్, అమ్మ సుధీర్, నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దిలీప్ రాజా.