అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన్మథుడు 2’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆగస్టు-09న మన్మథుడు అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. నాగ్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి.. తన లైఫ్‌లో ఎదురైన కొన్ని ఘటనలతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాజాగా ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి అక్కినేని మాట్లాడుతూ.. కొన్ని తప్పులు చేశానని ఒప్పుకున్నారు. తనకు సీరియస్‌గా సాగే సినిమాలు చూడటం ఇష్టం లేదని.. బాధతో కన్నీరు పెట్టుకోవడం అస్సలు నచ్చదన్నారు. మరి ఏ సినిమాలు నచ్చుతాయని మీడియా మిత్రులు అడగ్గా.. ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటే సినిమాలు చూసేందుకు మాత్రమే తాను ఇష్టపడతానన్నారు. అయితే ‘శివ’, ‘అన్నమయ్య’ తదితర చిత్రాల్లోని తన పాత్రలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన ‘నా కెరీర్‌లో కొన్ని పాత్రల ఎంపిక విషయంలో తప్పులు కూడా చేశాను.. వాటి నుంచి చాలా నేర్చుకున్నా’ అని నాగ్ చెప్పుకొచ్చాడు. సో.. ఏదైతేనేం తప్పులు తెలుసుకుని మరోసారి రిపీట్ చేయకపోతే మంచిదే కదా అని అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు.
కాగా.. సీనియర్ నటుడు అయినప్పటికీ.. నాగ్ మాత్రం తనకొడుకులతో.. టాలీవుడ్‌లోని కుర్ర హీరోలతో అందంలోనే కాదు.. సినిమాలు చేస్తూ ఢీ కొడుతున్నాడు. ఈ నెలలోనే పలువురు కుర్ర హీరోల సినిమాలు రిలీజ్ కాగా.. మున్ముంథు మరికొన్ని థియేటర్లలోకి రానున్నాయి. అయితే నాగ్ మాత్రం ఏ మాత్రం జంకకుండా ధైర్యంగా ‘నాటికి నేటికీ నేను మన్మథుడినే’ అంటూ అక్కినేని అభిమానుల ముందుకు వచ్చేస్తున్నాడు.