ప్రెస్ రిలీజ్ : తూనీగ..కొత్త కుర్రాళ్ల కలలకు తెరరూపు
- సృజనాత్మకతకు తార్కాణం.. డైలాగ్ పోస్టర్స్..
- సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ ద్వారా..
విడుదల చేసిన ప్రముఖ దర్శకులు వేణు ఊడుగుల
- పోస్టర్స్ రూపకర్తలకు ప్రత్యేక ప్రశంస
- ఆధునిక సినిమాకు మరో రూపం..తూనీగ చిత్రం
- డైరెక్టర్ ప్రేమ్ సుప్రీమ్ వెల్లడి
ఒక దైవరహస్యం ఏంటన్నది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుంది.. ఒక ఇతిహాస తరంగం ఏ వివరం చెబుతుందో తెలియనుంది.. నూతన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ ప్రయత్నం ఫలించి, ఆయన విజయ తీరాలకు చేరాలని కోరుకుంటూ.. కొత్త ఆలోచనలకు చిరునామాగా రూపొందిన డైలాగ్ పోస్టర్లను ప్రముఖ దర్శకులు, విరాట పర్వం చిత్రం రూపకర్త వేణు ఊడుగుల సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. కథాబలం ఉన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందని ఇటీవల విడుదలయిన చిన్న చిత్రాలనేకం నిరూపించాయని, ఆ కోవలో, ఆ తోవలో ‘తూనీగ’ నిలవాలని కోరుకుంటూ, బుల్లి పిట్ట మాధ్యమం ట్విటర్ ద్వారా సందేశించారు. ఆ వివరాలివి..
హైదరాబాద్ : వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ చిత్ర డైలాగ్ పోస్టర్లను ప్రముఖ దర్శకులు వేణు ఊడుగుల సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సరికొత్త ఆలోచనలతో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నూతన దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ కష్టం ఫలించి, ఈ చిత్ర రూపకర్తగా ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని, తన ప్రతిభను మరింత పెంపొందించుకునే దిశగా మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలన్నదే తన అభిమతం అన్నారు. సృజనకు ఎల్లలు లేవని నిరూపించాలని, ఆ దిశగా వేస్తున్న తొలి అడుగు ఫలప్రదం కావాలని అభిలషించారు. ప్రోమో డైలాగ్ రైటర్ రత్నకిశోర్ శంభుమహంతిని, డైలాగ్ పోస్టర్లను అందంగా రూపొందించిన ప్రముఖ ఆర్టిస్టులు గిరిధర్ అరసవల్లి, బాబు దండ్రుపెల్లి, ధనుంజయ అండ్లూరిని, ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ తరహా వినూత్న ప్రచారం తననెంతో ఆకట్టుకుందని, ముందున్న కాలంలో డిజిటల్ మాధ్యమాలు మరిన్ని కొత్త ఆలోచనలకు నాంది కానున్నాయని, వాటికి సంకేతంగా ఈ పోస్టర్స్ ఉన్నాయని విశ్లేషించారు.
అదుర్స్..అదుర్స్ : ఆకట్టుకుంటున్న పోస్టర్లు
మరో చందమామ కథ, వెండితెరపై వెలుగులీను కథ, సందెబువ్వల వేళ సక్కంగ వినిపించు కథ, మీ కథ, మా కథ, మనందరి కథ అంటూ.. సెల్యులాయిడ్ పై తూనీగ చిత్రం త్వరలోనే సందడి చేయనుంది. రెక్కలు కట్టుకుని నేలపై వాలుతూ, రంగులు విరజిమ్ముతూ, వెదజల్లుతూ ఆ తారల తూగుటుయ్యాలల చెంతకు చేరుతూ.. కొత్త కుర్రాళ్ల కలల సాకారం వెనుక కష్టం ఎంతన్నది తెలియ జెప్పనుంది. ప్రముఖ ఆర్టిస్టులు గిరిధర్ అరసవల్లి, బాబు దుండ్రపెల్లి, ధనుంజయ అండ్లూరి రూపొందించిన ఈ డైలాగ్ పోస్టర్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వీటికి నెటిజన్ల నుంచీ, సినిమా రూపకర్తల నుంచీ మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కథాసారాన్ని సంకేతిస్తూ.. ప్రచార నిమిత్తం రాసిన సంభాషణ (ప్రోమో డైలాగ్) సినిమాపై మరింత ఆసక్తిని పెంపొందిస్తోంది. డిజిటల్ ఆర్టిస్టుల సృజనకు, మంచి మాటలు తోడవ్వడంతో ఆన్ లైన్ మాధ్యమాల్లో ఉంచిన ఈ డిజిటల్ పోస్టర్లు నెటిజన్లను అమితామితంగా ఆకర్షి స్తున్నాయి.
ఆదరించాలి మీరు : కొత్త తరం ఓనమాలు ఇవి....
డైలాగ్ పోస్టర్ల విడుదల అనంతరం చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంది. అడిగిన వెంటనే తమ విన్నపాన్ని మన్నించి, మంచి మనసు చాటుకున్న డైరెక్టర్ వేణు ఊడుగులకు కృతజ్ఞతలు తెలిపింది. సెల్యులాయిడ్ పై కొత్త తరం దిద్దుతున్న ఓనమాలు ఇవి అని, వినూత్నతకు, విభిన్నతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమా నిర్మాణానికి నోచుకుందని పేర్కొంటూ.. శుభాలిచ్చే ఈ శ్రావణ మాస ఆరంభాన అందరికీ శుభాకాంక్షలు చెప్పింది.. కాగా ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని స్వరాలు సమకూరుస్తున్నారు. రిషి ఎదిగ సినిమాటోగ్రఫర్ గా, ఆర్కే కుమార్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రేమ్ పెయింటింగ్స్ పతాకంపై క్రౌడ్ ఫండింగ్ విధానంలో నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్ర ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర రూపకర్తలు.
కాగా.. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. డైరెక్టర్ ప్రేమ్ సుప్రీమ్ స్వస్థలం శ్రీకాకుళంతో సహా విశాఖ, హైద్రాబాద్, బెంగళూరు నగరాల పరిసర ప్రాంతాల్లో ‘తూనీగ’ తెరకెక్కింది. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంతో వెండి తెరకు, వెలుగుల తెరకు తొలిగా పరిచయం అవుతుండడం విశేషం.