అవును మీరు వింటున్నది నిజమే.. వైల్డ్ కార్డ్ ద్వారా ఊహించని వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. ఆమె/అతడు ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్లు, బిగ్‌బాస్ ప్రియులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఇదిగో అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తి మరెవరో కాదండోయ్ తమన్నా.. ఓహ్ తమన్నా అంటే మిల్క్ బ్యూటీ అనుకునేరు బాబోయ్.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అదేనండి.. హిజ్రా తమన్నా సింహాద్రి ఉన్నారు కాదా ఆమే.
మొదటి వారంలో ఆరుగురు ఎలిమినేషన్‌లో హేమ, రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్‌లను ఎలిమినేషన్‌కు బిగ్ బాస్ నామినేట్ చేసిన విషయం విదితమే. వీరిలో సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అవ్వడంతో ఫస్ట్ వికెట్ డౌన్ అయ్యింది. అయితే హేమ ఎగ్జిట్ అవ్వగా.. తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చారు.
వాస్తవానికి తమన్నాను బిగ్‌బాస్-3కి సెలెక్ట్ చేయడం బిగ్ సర్‌ఫ్రైజ్ అని చెప్పుకోవాలి. అసలు ఈమె వస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అయితే మొదట హాట్ భామలైన శ్రద్ధా దాస్, లేదా కుమారి 21ఎఫ్ భామ హెబ్బా పటేల్‌గానీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బిగ్‌బాస్ మాత్రం తమన్నా సింహాద్రిని హౌస్‌లోకి పంపారు. తమన్నా ఎంట్రీతో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.