అల్లువారబ్బాయి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఇటీవల కొన్నికోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఫాల్కన్ కంపెనీకి చెందిన కారవాన్‌ను కొనుగోలుచేసిన విషయం విదితమే. అంతేకాదు.. తన స్టైల్‌కు అనుగుణంగా దాన్ని లోపల భాగంలో ఇంటీరియర్ ఇలా అన్నీ రూపురేఖలు మార్చేశారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ముంబై చెందిన ప్రముఖ డిజైనర్‌లకు భారీగానే వెచ్చించా తనకు నచ్చినట్లుగా చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. స్వయానా బన్నీనే తన ట్విట్టర్ వేదికగా ఈ కారవాన్ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలను చూసిన మెగాభిమానులు, బన్నీ అభిమానులు మురిసిపోయారు.
అయితే ఈ కారవాన్ విషయంలో హైదరాబాద్ పోలీసులు బన్నీకి సడన్ షాకిచ్చారు. కారవాన్ మొత్తం నలుపు రంగులోనే ఉండటంతో టింట్ గ్లాస్‌లు సైతం అనుకోకుండా నలుపు రంగులోనే చేయించేసుకున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేర ఎవరూ టింట్ గ్లాస్‌ను ఉపయోగించరాదనే కండిషన్ ఉంది. బన్నీ కార్వాన్ నిబంధనలకు విరుద్ధంగా అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫొటోలు తీసి ట్విటర్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా కానీ.. సోషల్ మీడియా ద్వారా గానీ ఫిర్యాదులు అందితే చాలు యమా స్పీడ్‌గా సిటీ పోలీసులు క్షణాల్లోనే స్పందించారు.
వెంటనే.. పోలీసులు అల్లుఅర్జున్‌కు రూ.735 చలానాను విధించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. పేరున్న హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా అని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీని టార్గెట్‌గా చేసుకుని ఈ ఫొటోలు తీసిందెవరు..? అని తెలుసుకునే పనిలో అభిమానులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో బన్నీనే క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.