70’స్ నుంచి ఇప్పటివరకూ వున్న సూపర్‌స్టార్స్ అందరూ కలిసి నటించిన ‘కురుక్షేత్రం’ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్
మహాభారతం లాంటి అత్యద్భుత దృశ్య కావ్యాన్ని తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌మీద 3డిలో చూడబోతున్నాం. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కర్ణుడుగా, దర్శన్ దుర్యోధనుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమన్యుడిగా నిఖిల్‌గౌడ్, కృష్ణుడిగా రవిచంద్రన్ నటించగా ద్రౌపదిగా స్నేహ నటించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదుభాషల్లో విడుదలవ్వడం విశేషం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మైథలాజికల్ 3డి వెర్షన్‌గా ఈచిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి తెలుగు, కన్నడ బాషల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి సౌత్ ఇండియా సెన్సేషనల్ ప్రొడ్యూసర్‌గా పేరుగాంచిన రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాపై ఫ్యాషన్‌తో తన ప్రొఫెషన్‌గా తీసుకుని ఎన్నోచిత్రాలు కన్నడలో నిర్మించిన మునిరత్న(ఎంఎల్ఎ) ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఈ చిత్ర కథని అందించారు. నాగన్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్, ఆడియో లాంచ్ బుధవారం ప్రముఖ నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, బన్నీవాసు చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పటి నుంచో భారతాన్ని 3డిలో చేయాలనుకున్నాను. నేను భావించినట్లే 3డిలో మొట్టమొదటిసారి ఆల్ ఓవర్ ఇండియాలో ఈ కురుక్షేత్రం విడుదల చేయడం ఆనందంగా ఉంది. టీం అందరికీ నా అభినందనలు..’’ అన్నారు.
బన్నీవాసు మాట్లాడుతూ.. ‘‘ఈ కథని 3డిలో తియ్యాలని ప్రేక్షకులకు అందించాలనే ఆలోచన రాక్‌లైన్ వెంకటేష్‌గారికి, నిర్మాత మునిరత్నంగారికి రావటం, వారు ఆ ప్రయత్నాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత భారీ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించినందుకు ముందుగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే రామాయణం, భారతం లాంటివి ప్రస్తుతం జనరేషన్‌కి తెలియవు. ఎవెంజర్స్, హల్క్ ఇంకా ఇలాంటి వన్నీ క్యారెక్టర్స్ తప్ప మన భారతంలో కూడా హల్క్ లాంటి బలమైనవాళ్ళు ఉన్నారని ప్రస్తుతం జనరేషన్‌కి తెలియదు. నేను నా పిల్లలను తప్పకుండా ఈ సినిమాకి తీసుకువెళ్ళి చూపిస్తాను. ఇంత మంచి చిత్రాన్ని అందిస్తున్న మునిరత్నగారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన అర్జున్ గారికి, దర్శన్ గారికి మరియు సోనూసూద్‌గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు..’’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ మునిరత్న మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని కొంత మంది దానవీరసూరకర్ణ అనే చిత్రంతో కంపేర్ చేస్తున్నారు. దానవీరసూరకర్ణ అనే చిత్రం ఒకేసారి పుట్టింది ఇంక రాదు కానీ బాహుబలి లాంటి చిత్రాలు చేయవచ్చు. ఎవరు చేసినా అది మన ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటం కోసమే. కానీ ఈ చిత్రం ఎంటర్‌టైన్ కోసం మరియు ఈ జనరేషన్‌కి మహాభారతాన్ని తెలియజేయటం కోసం కురుక్షేత్రం చేస్తున్నాము. కన్నడ సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సోనూసూద్ అర్జునుడుగా నటించాడు. అలాగే మా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ దుర్యోధనుడిగా చాలా బాగా చేశాడు. అర్జున్‌ని కర్ణుడుగా చూపించాము. ఇంకా రవిచంద్రన్ కృష్ణుడుగా, కీర్తిశేషులు అంభరీష్‌గారు కూడా భ్రీష్ముడిగా నటించారు. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు.
సోనూసూద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నటించడం నాకు ఒక యాక్టర్‌గా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎన్ని చిత్రాల్లో నటించినా ఈ చిత్రంలో చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా మంచి మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా చాలా పెద్దది. ఇక్కడ ప్రేక్షకులు కూడా నన్ను ఎంతో బాగా ఆదరిస్తారు. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
హీరో అర్జున్ మాట్లాడుతూ.. ‘‘చిత్ర నిర్మాతకి, రాక్‌లైన్ వెంకటేష్‌గారికి, దర్శన్‌గారికి, బన్నీవాసుగారికి అందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత మంచి చారిత్రాత్మక చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. సినిమాలో నా క్యారెక్టర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అన్ని రసాలు ఉన్న పాత్ర నాది. సినిమాని అందరూ తప్పకుండా చూడండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏమాత్రం తగ్గదు..’’ అన్నారు.
డైరెక్టర్ నాగన్న మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో దర్శన్ దుర్యోధన పాత్ర పోషించారు. నిర్మాత మునిరత్నగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మైథలాజికల్ ఫిల్మ్‌ని 3డిలో చేసిన క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. కురుక్షేత్రం చిత్రం అంటేనే పండగలా ఉంటుంది. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి’’ అని అన్నారు.
దర్శన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా గురించి చెప్పాలంటే 70ల కాలం నుంచి 2019 వరకు ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ చిత్రంలో నటించారు. మునిరత్నగారికి కృతజ్ఞతలు. ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు ఎవరు చేస్తున్నారు. కానీ ఆయన చేశారు. మైథలాజికల్ చిత్రం ఇప్పటి జనరేషన్‌కి తెలియదు. అర్జునుడు, దుర్యోధనుడు ఎవరికీ తెలియదు. ఈ సినిమాని 3డిలో చూడడం గర్వంగా ఉంది. నా పిల్లలు కూడా హల్క్, స్పైడర్‌మెన్ లాంటి పాత్రలకి ఎట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఈ పాత్రలన్ని మన భారతదేశం నుండి పుట్టినవే అని తెలియజేయాలి, ఈ చిత్రం తప్పకుండా అందరికీ ఈ పాత్రల్ని పరిచయం చేస్తుంది. ఇక్కడకి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు..’’ అన్నారు.
వెన్నెలకంటి మాట్లాడుతూ.. ‘‘తింటే గారెలే తినాలి. చూస్తే భారతం చూడాలి అన్న నానుడి ఉండనే ఉంది. ఈ సినిమాకి హీరో మునిరత్నగారే. ఇంత మంచి చిత్రానికి నాకు మాటలు, పాటలు రాసే అవకాశం కల్పించిన నాగన్నగారికి, ప్రొడ్యూసర్‌గారికి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని అన్నారు.
చిత్ర సమర్పకుడు రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఓ గొప్ప చిత్రాన్ని మునిరత్నగారు నిర్మించటం నేను సమర్పకుడిగా వుండటం చాలా ఆనందంగా వుంది. ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేయటానికి సహకరించిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన అర్జున్‌గారు, మా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు, సోనూసూద్ గారు , రవిచంద్రన్ గారు, స్నేహ గారు ఇలా చాలా మంది పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము’’ అని అన్నారు.