టైటిల్ చూడగానే.. వామ్మో ఒక్క ఏడాదికే ఇన్ని కోట్లా అని నోరెళ్లబెట్టకండి.. ఇది అక్షరాలా నిజమే..! బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జూన్ 2018 నుంచి ఈ ఏడాది జూన్ వరకూ మొత్తం రూ. 444 కోట్లు ఆర్జించినట్లు లెక్కలు తేలాయి. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆర్జన కలిగిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అక్షయ్‌కు చోటు దక్కింది.
అక్షయ్ కుమార్ ఒక్క సినిమాలే కాకుండా ప్రకటనలు, ప్రముఖ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏడాదిలో అక్షయ్ మూడు నుంచి నాలుగు సినిమాల్లో చేస్తుంటారు. అలా ఒక్కో సినిమాకు సుమారు రూ.40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు అంటే ఏడాది మొత్తంమ్మీద రూ. 444 కోట్లు సంపాదించారని పోర్బ్స్ ప్రకటనలో తేల్చింది.
అయితే ఈ పోర్బ్స్ జాబితాలో ఖాన్ త్రయంతో పాటు పలువురు టాప్ స్టార్‌లకు చోటు దక్కలేదు. కాగా.. మొదటి స్థానంలో అమెరికా గాయని టేలర్ స్విస్ట్ ఉండగా.. అక్షయ్‌కు 33వ స్థానం దక్కింది. అంతేకాదు.. ఈ జాబితాలో అక్షయ్ కుమార్.. జాకీచాన్‌ను మించి పోయారు. ఏదేమైనప్పటికి మన ఇండియా నుంచి అక్షయ్‌కు చోటు దక్కడం సంతోషించదగ్గ విషయమేనని విశ్లేషకులు చెబుతున్నారు.