అల్లు అర్జున్ హీరోగా ఐదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’లో విలన్ మద్దాలి శివారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటారు.. మరిచిపోదామన్నా ఈయన యాక్టింగ్ మరవలేం. మద్దాలి శివారెడ్డి అసలు పేరు రవికిషన్. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఘన విజయం సాధించారు. మొదటిసారి నెగ్గలేకపోయిన ఆయన రెండోసారి మాత్రం గెలిచి నిలిచారు.
ఎంపీగా గెలిచిన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజు ప్రమాణం చేశారు. అయితే నాటి నుంచి ఇవాళ్టి వరకూ ఆయన పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం దక్కలేదు. సోమవారం నాడు జరిగిన సమావేశాల్లో ఆయను తనను సభకు పరిచయం చేసుకుంటూ ప్రసంగం ప్రారంభించి.. సాంగ్‌తో ముగించారు. భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడుతారనీ.. అంతేకాకుండా అర్థం కూడా చేసుకోగలరన్నారు. మారిషస్‌లో మరో అధికార భాషగా భోజ్ పురిని గౌరవించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
హే గంగా మయా తుహే.. అంటూ రవికిషన్ ఓ సాంగేసుకున్నారు. ఆయన రెండు లైన్లే అయినప్పటికీ.. సభలోని సభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యి ఆయనవైపే తథేకంగా చూడసాగారు. సినిమాల నుంచి వచ్చాడుగా.. కళాపోషణ ఎక్కడికెళ్తుందిలే అన్నట్లుగా కొందరు సభ్యులు నవ్వుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ గురించి మాట్లాడిన ఆయన.. ‘కాశీ ప్రజలారా ఎలా ఉన్నారు?’ అంటూ భోజ్ పురిలో మాట్లాడారనీ.. దీంతో తమ భాషకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని రవికిషన్ ఆనందం వ్యక్తం చేశారు.