టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారా..? ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న బీజేపీ.. మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదా..? అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ పదవీ కాలం కూడా అయిపోవడంతో రాజకీయాల్లో చురుగ్గా లేరు. అంతేకాదు సొంత తమ్ముళ్లు ఇద్దరూ 2019 ఏపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. అప్పట్లో అందరూ చిరు రూటు వేరు.. మెగా బ్రదర్స్ రూటు వేరు అని చెప్పారు కూడా. అయితే తాజాగా మళ్లీ మెగాస్టార్ బీజేపీతో రీ-ఎంట్రీ ఇస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి.
చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ప్రస్తుతం రాజ్యసభ సీటుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి.. రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని కమలనాథులు ఆయనకు హామీ ఇచ్చారట. అయితే బీజేపీ ఆఫర్‌కు చిరు ఎలా రియాక్ట్ అయ్యారు..? అసలు వీటిలో నిజానిజాలెంత..? ఒక వేళ బీజేపీలోకి వెళ్తే చిరు చివరి సినిమా ‘సైరా’ నేనా అని ఇలా పలు ప్రశ్నలు అటు అభిమానులు, ఇటు జనసేన కార్యకర్తల్లో మెదులుతున్నాయి. ఫైనల్‌గా చిరు ఏం డిసైడ్ అవుతారో తెలియాల్సి ఉంది.