ఈ మధ్యన హైదరాబాద్ సిటీలో బహిరంగ ధూమపానం చేస్తే... పోలీస్ లు ధూమపానం చేసిన వారి నుండి 200 రూపాయలు ఫైన్ వేసి మరీ వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖతో కలిసి బహిరంగంగా స్మోకింగ్ చేస్తే వారికీ 200 రూపాయల ఫైన్ వెయ్యడమే కాదు... చాలామంది నుండి ఆ ఫైన్ కూడా వసూలు చేస్తున్నారు. తాజాగా హీరో రామ్ కూడా బహిరంగ ధూమపానం చేసి పోలీస్ లకు 200 ఫైన్ కట్టాడు.
అసలు రామ్ ఎందుకు ఫైన్ కట్టాడంటే... హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ ఇష్మార్ట్ శంకర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ మాస్ కాదు కాదు ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. మరి మాస్ అంటే దమ్ము కొట్టాల్సిందేగా... అందుకే ఆ సన్నివేశంలో భాగంగా షూటింగ్ లొకేషన్ లో రామ్ సిగరెట్ తాగుతుండగా... పోలీస్ లు రామ్‌కి ఫైన్ విధించారు.
మరి ఈ బహిరంగ ధూమపానానికి ఇప్పటివరకు సామాన్య మానవులే ఫైన్ కట్టారు కానీ... ఇప్పుడు మొదటగా ఓ సెలెబ్రిటీ అయ్యి ఉండి రామ్ ఫైన్ కట్టడం హాట్ టాపిక్ అయ్యింది. మరి షూటింగ్ షూటింగే... ఫైన్ ఫైనే కదా...!