తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం..
ప్రముఖ నటులు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ ఫిలింనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకులు ఎన్ శంకర్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, చిత్రపురి కాలనీ సంఘ సభ్యులు వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా యావత్ తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి అపర భగీరథుడు కేసీఆర్ చిత్ర పటానికి కార్యక్రమంలో పాల్గొన్న వారంతా క్షీరాభిషేకం చేశారు.
అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో నిలిచిపోయే బృహత్కార్యాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారు. ఆయన కార్యసాధన దీక్ష, ప్రజలకు మేలు చేయాలనే నిరంతర తపనతోనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తయింది. తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తున్న అపర భగీరథుడు కేసీఆర్. ఆయన వెంట కోట్లాది మందితో పాటు మేమూ నడుస్తాం. బంగారు తెలంగాణలో భాగస్వామ్యులం అవుతాం..’’ అన్నారు.
దర్శకులు ఎన్ శంకర్ మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా తాను గొప్ప కార్యసాధకుడిగా మన ముఖ్యమంత్రి అని కేసీఆర్ నిరూపించుకున్నారు. ఆయన కృషిని చూసి మొత్తం తెలంగాణ ప్రజానీకం గర్విస్తోంది. మా స్టూడియో నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడాలని ఆశిస్తున్నా.. అన్నారు.