కమెడియన్ ప్రియదర్శి టైటిల్ పాత్రలో చేసిన చిత్రం ‘మల్లేశం’. ఇది ఈ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇది చింతకింది మల్లేశం బయోపిక్ ఆధారంగా తెరకెక్కింది. అయితే అసలు ఈ చిత్రం సెట్స్ మీదకు ఎలా వెళ్లిందో డైరెక్టర్ రాజ్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను దాదాపు 11 ఏళ్ళ కిందట ఓ కథ, స్క్రీన్ ప్లే రాసుకుని తమిళంలో నిర్మాతగా సినిమాని తెరకెక్కించాను. అది డిజాస్టర్ అయింది. దాంతో అప్పులు చెల్లించేందుకు ఐదేళ్లు శ్రమించాల్సి వచ్చింది. ఆ క్రమంలో అమెరికాకు వెళ్లి అక్కడ సినిమా తీయడం ఇంత కష్టమా? అనుకున్నా. ఆ టైంలోనే చాలా కథలు, స్క్రీన్‌ప్లే రాసుకున్నా. అందులో ది బెస్ట్ అనే దాని కోసమే వేచి చూసాను. చివరికి చింతకింది మల్లేశం గారి గురించి తెలుసుకున్నా. ఆయన కథ స్ఫూర్తివంతం అనిపించింది. ఆయనను కలిసి మీ మీద బయోపిక్ తీస్తున్నా.. రైట్స్ కావాలని కోరాను. ఇంకా సినిమా తీయడమే లేట్. మరి ఈ పాత్రకు ఎవరు సెట్ అవుతారు అని ఆలోచిస్తే నాని కానీ, విజయ్ కానీ అనుకున్నా. కానీ ఇద్దరూ మరో మూడేళ్ల పాటు కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి ఉంది.
మరి ఎవరు అని ఆలోచిస్తున్న టైములో ఎవరో దర్శి పేరు సూచించారు. కానీ అప్పటికే దర్శి కమెడియన్ వేషాలు వేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటువంటి సీరియస్ పాత్రలకు ఆయన సూట్ అవ్వుతాడా? అని అనుకున్నా.. కానీ అతడు నటించిన బొమ్మల రామారాం వంటి చిత్రాలు చూశాక తను మల్లేశం పాత్రకు సరిపోతాడని అనిపించింది. దాంతో దర్శినే పెట్టి సినిమా చేశాను. ఈ మూవీని తరుణ్ భాస్కర్ అయితే బాగా తీయగలడని దర్శి మొదట్లో చెప్పాడు. కానీ నేను రాసుకున్న కథ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తే తనకు స్వేచ్ఛ ఉండదని నేను డైరెక్ట్ చేశాను..’’ అని రాజ్. శ్రీ అధికారి చెప్పుకొచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.