ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించి నయా లుక్‌లో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గడ్డం, మీసాలు తీసేసి పవన్ గెటప్ మార్చేయడంతో ‘గబ్బర్ సింగ్’ మళ్లీ మూవీస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వచ్చాయ్. అయితే ఈ వ్యవహారంపై లైవ్ స్ట్రీమ్‌లో మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేశారు.
పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్ మాదిరిగానే.. నాగబాబు కూడా డైలాగ్ చెప్పాడు. కల్యాణ్ బాబు ఓసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడని.. సినిమాలు చేయనని చెప్పాక మళ్లీ తీయడుగాక తీయడని చెప్పుకొచ్చారు. అయితే అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చారని.. కానీ కల్యాణ్ బాబు అలా కాదు.. సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లారన్న విషయాన్ని మరోసారి నాగబాబు గుర్తుచేశారు. అంతేకాదు.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు ఇలా చేయడం సరైన విధానం కాదని నాగబాబు తెలిపారు.
అయితే అతిథి పాత్రలో నటించమని ఎవరైనా అడిగితే ‘తమ్ముడు’ నటిస్తారంతే కానీ.. హీరోగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నటించరని నాగబాబు తేల్చిచెప్పారు. అయితే ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పిన పవన్ కల్యాణ్.. భవిష్యత్తులో నిర్ణయం మార్చుకుంటారో లేకుంటే ఫుల్‌టైమ్ పొలిటిషియన్‌గానే కొనసాగుతారో వేచి చూడాల్సిందే మరి.