ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆశించినంతగా కాదు కదా.. కనీసం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసినా ఒక్కచోట కూడా గెలవలేని పరిస్థితి నెలకొంది. అయితే పార్టీ తరఫున మాత్రం వన్ అండ్ ఓన్లీ ఒక్కరు గెలవడం గమనార్హం. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తున్నారని ఫలానా నిర్మాణ సంస్థ నుంచి డబ్బులు తీసుకున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. అందరూ అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వస్తున్నారు కానీ.. హీరోగా కాదు ఒక నిర్మాతగా మాత్రమే. అబ్బాయ్.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ నిర్మాతగా మారనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అనే బ్యానర్‌ను పవన్ ఎప్పుడో ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో ఇప్పటికే పలు సినిమాలను నిర్మించడం కూడా అయిపోయింది. అయితే తాజాగా.. చెర్రీతో సినిమా నిర్మిస్తారని టాక్ నడుస్తోంది.
తన ప్రాణ స్నేహితుడు అయిన స్టార్ డైరెక్టర్ త్రివక్రమ్‌కు ఇప్పటికే ఓ అద్భుతమైన కథ రాయాలని పవన్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యే లోగా లేదా 2020 మొదట్లో చిత్రం చేయాలని పవన్, తివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ప్లాప్ అయిన పవన్ కల్యాణ్.. సినిమా రంగంలో ఏమాత్రం రాణిస్తారో..? అసలు పవన్ గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే చెర్రీ గానీ లేదా.. పవన్ గానీ రియాక్ట్ అవ్వాల్సిందే మరి.