ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎంపీగా పోటీచేసిన నాగబాబుపై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించిన విషయం విదితమే. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సీఎం వైఎస్ జగన్‌ను టాలీవుడ్ ఎందుకు పట్టించుకోవట్లేదు..? ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు పట్టించుకోవట్లేదంటూ మీడియా ముఖంగా కాసింత ఓవరేక్షన్ చేశారని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు.
అయితే తాజాగా.. పృథ్వీ తమ సినిమాల్లో నటించడానికి వీల్లేదని.. అతన్ని మెగా హీరోల సినిమాల్లో బ్యాన్ చేయాలని.. మెగా ఫ్యామిలీ భావించిందట. అంతేకాదు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీలో నుంచి పృథ్వీని తీసేశారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మా నేతను బ్యాన్ చేసిన మీ సినిమాలు మేం చూడం అంటూ వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారమే రేపుతున్నారు.
ఈ వ్యవహారంపై ఎట్టకేలకు స్పందించిన పృథ్వీ.. పవర్‌స్టార్ పవన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికి గౌరవం ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో తనకు ఆఫర్ ఉందా..? ఆ విషయం తనకే తెలియదే..? అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్లవని.. వాటిని సినీరంగానికి, కళాకారులకు ఆపాదించకూడదని పృథ్వీ తేల్చిచెప్పారు. సో.. ఇకనైనా మెగా ఫ్యాన్స్... వైసీపీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆపుతారో లేదో చూడాల్సిందే మరి.