శర్వానంద్ ఆపరేషన్ పూర్తి.. రెండు రోజుల్లో డిశ్చార్జ్.. ఫిజియోథెరపీ చికిత్సను అందిస్తాం - సన్ షైన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.గురవారెడ్డి
‘96’ చిత్రీకరణలో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో శర్వానంద్ భుజం, కాలికి గాయాలయ్యాయి. షోలర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. శర్వానంద్ వెంటనే థాయ్‌లాండ్ నుండి హైదరాబాద్ చేరుకుని, సన్‌షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.గురవారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం శర్వానంద్ భుజానికి శస్త్ర చికిత్స చేశారు. నాలుగు గంటల పాటు సర్జరీ, ఐదు గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మూడు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. నిన్న సాయంత్రం ఐదు గంటల తర్వాత ఐ.సి.యులో ఉంచారు. ఈరోజు (మంగళవారం) ఉదయం పదకొండున్నర గంటల తర్వాత రూమ్‌కు షిఫ్ట్ చేశారు.
శస్త్ర చికిత్స అనంతరం సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ గురవా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శర్వానంద్‌తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మా కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటాను. దురదృష్టవశాత్తూ థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో తన షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆ ఫ్రాక్చర్ ఐదారు ముక్కలుగా అయ్యింది. తను మా హాస్పిటల్‌కు రాగానే పరీక్షలు చేశాం. సోమవారం మా మెడికల్ టీం డా.కమలాకర్, డా.సుబ్రమణ్యం, డా.చంద్రశేఖర్, ప్లాస్టిక్ సర్జన్ డా.భవానీ ప్రసాద్, ఎనస్తటీషియా డా.గిరిధర్ సహా నా ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. బోన్ ఫ్రాక్చర్ ఐదారు ముక్కలుగా ఉండటం వల్ల చాలా టైం పట్టింది. అయితే ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాం. రైట్ షోల్డర్ కాబట్టి స్టిఫ్‌గా ఉంటుంది. మామూలుగా కావడానికి కొంత సమయం పడుతుంది. రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చికిత్సను అందిస్తాం. ఇది కాకుండా కాలిలో ఓ చిన్న ఫ్రాక్చర్ ఉంది. దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. ఈ రోజు ఐసియు నుండి రూమ్‌కు షిఫ్ట్ చేశాం. రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. ఈ రెండు గాయాలు తప్ప.. మరే సమస్యలు లేవు. తను త్వరగానే కోలుకుంటాడు’’ అని అన్నారు.