“నిజమేంటో తెలుసుకోకుండా నా పై అసత్య ప్రచారాలు చేయడం తగదు’’ అని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, విద్యావేత్త మంచు మోహన్ బాబు అన్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైజాగ్ నుంచి చిత్తూరు వరకూ వైఎస్ఆర్‌సీపీ తరఫున భారీ ఎత్తున ప్రచారం చేసిన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ తరఫున ఏదో పదవి ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అయితే తాను ఏ పదవీ ఆశించలేదని డా. మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన ఈ విధంగా స్పందించారు.
“మీడియా మిత్రులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా మీడియాలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు మోహన్ బాబుకి ఫలానా పదవి ఇవ్వబోతున్నారని ఊహాగానాలు చేస్తూ నా పేరుని, నా ఛాయా చిత్రాన్ని చానెల్స్ లో పదే పదే చూపిస్తూ నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి కావాలని మాత్రమే ఆ భగవంతుడిని కోరుకున్నాను. అందులో ఏ స్వార్థమూ లేదు. ఏ పదవినీ ఆశించి ప్రచారం చేయలేదు. అందుకని ఇలాంటి ప్రచారాలు చేయడం భావ్యం కాదు. 50 ఏళ్లుగా అహర్నిశలూ నేను శ్రమించి సంపాదించిన కీర్తి ప్రతిష్టలకు అది భంగం అని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి ఊహాగానాలు ముందు ముందు నా పేరుతో ప్రచారం చేయవద్దని మనవి చేసుకుంటున్నాను..’’ అని మోహన్ బాబు తెలిపారు.